19 వరకు శరత్, బినోయ్ రిమాండ్ పొడిగింపు

19 వరకు శరత్, బినోయ్ రిమాండ్ పొడిగింపు
  • బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన శరత్​చంద్రారెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, లిక్కర్ వ్యాపారి బినోయ్ బాబులకు సీబీఐ స్పెషల్ కోర్టు డిసెంబర్ 19 వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగించింది. నవంబర్ 21 న ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు విధించిన 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ సోమవారంతో ముగిసింది. దీంతో నిందితులు బినోయ్‌‌‌‌ బాబు, శరద్‌‌‌‌చంద్రారెడ్డిలను అధికారులు సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ ద్వారా కోర్టులో హాజరు పరిచారు. అయితే, ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఎంకే నాగ్‌‌‌‌పాల్ సెలవులో ఉన్నందున, మరో జడ్జి వికాస్ ధుల్ కోర్టులో విచారణ సాగింది. ఈ సందర్భంగా శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీ తరఫు అడ్వొకేట్ వాదనలు కొనసాగించారు. శరద్ చంద్రారెడ్డిపై విచారణ పెండింగ్‌‌‌‌లో ఉందని, ఆయనపై ఇంకా చార్జిషీట్ దాఖలు చేయలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. కాగా, శరత్ చంద్రారెడ్డి పిటిషన్ పై సమాధానం చెప్పాలని దర్యాప్తు సంస్థకు నోటీసులు ఇచ్చింది. బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం జ్యూడిషీయల్ కస్టడీలో ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు వింటర్ క్లాత్స్, వాటర్ ఫ్లాస్క్, బూట్లు, సెలెక్టెడ్ బుక్స్, రెండు జతల బట్టలు, అవసరమైన మెడిసిన్ వాడేందుకు సీబీఐ స్పెషల్ కోర్టు అనుమతి ఇచ్చింది.

అభిషేక్ బెయిల్ పిటిషన్ రద్దుపై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయిన అభిషేక్ బోయినపల్లి, ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌‌‌‌చార్జి విజయ్ నాయర్‌‌‌‌‌‌‌‌ బెయిల్ పిటిషన్ రద్దుపై విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. గత నెల 14న రౌస్ ఎవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌‌‌‌పై నవంబర్ 24న జస్టిస్ యోగేశ్‌‌‌‌ ఖన్నా ఆధ్వర్యంలోని సింగిల్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారణ జరిపి.. సీబీఐ పిటిషన్‌‌‌‌కు కౌంటర్ దాఖలు చేయాలని నిందితులకు నోటీసులిచ్చింది. దీనిపై సోమవారం బెంచ్‌‌‌‌ మరోసారి విచారణ జరిపింది. సౌతిండియా నుంచి ఢిల్లీకి దాదాపు రూ.30 కోట్ల నగదు చేరిందని, ఆ అమౌంట్ ప్రభావవంతమైన వ్యక్తులకు చేరిందని సీబీఐ తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ వాదించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని, సీబీఐ స్పెషల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలపై స్టే విధించాలని కోరారు. నిందితుల తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ కేసు విచారణ వాయిదా వేయాలని బెంచ్‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి.. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.