‘ఉన్నొక్క గ్రహం’ రక్షణకు దినోత్సవాలు చాలవు!

‘ఉన్నొక్క గ్రహం’ రక్షణకు దినోత్సవాలు చాలవు!

సరిగ్గా అర్థశతాబ్దం కిందట 1972లో స్టాక్​ హోం సదస్సులో మొదటిసారి పర్యావరణ పరిరక్షణ విషయం పై భూమి ఒక్కటే జీవమున్న గ్రహం.. దీన్ని పరిరక్షించుకోవాలి” అన్న ప్రస్తావన వచ్చింది. చరిత్ర పునరావృతమవుతుంది అన్న చందాన సరిగ్గా అర్థశతాబ్దం గడిచాక యునైటెడ్​ నేషన్స్ ‘ఓన్లీ వన్​ ఎర్త్​​’ అన్న స్లోగన్​తో పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల్లో, రాష్ట్రాల్లో పలుచోట్ల పర్యావరణ దినోత్సవాలు జరిగాయి. కానీ సంవత్సరంలో ఒక్కరోజు జరుపుకొనే ఉత్సవాలు పర్యావరణాన్ని కాపాడలేవు. ఈ స్ఫూర్తిని, నిబద్ధతని ఏడాది పొడువునా అంటే 365 రోజులూ ఆచరిస్తే తప్ప పుడమిని కాపాడుకోలేం. అది నిర్వహించడానికి ఎంతో పెద్ద కర్తవ్యం మానవాళి ముందుంది. అంతర్జాతీయ ప్రభుత్వాల పరంగా, కార్పొరేట్ల పరంగా, పౌరసమాజాల పరంగా వ్యక్తులుగా కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తేనే ముంచుకు వస్తున్న వాతావరణ మార్పు ప్రభావాన్ని తట్టుకొని నిలబడగలుగుతాం. ఒకేఒక్క జీవగ్రహమైన పుడమిని కాపాడుకోగలుగుతాం.

పచ్చని పంట పొలాలతో, ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన ప్రాణవాయువును పీలుస్తూ, అంటువ్యాధులను సైతం అవలీలగా జయించి, రసాయనిక పదార్థాలు లేని, సహజసిద్దమైన  బలవర్ధకమైన ఆహారాన్ని భుజించి, ఆరోగ్యవంతంగా నిండు నూరేళ్ళు  జీవించిన నాటితరం.. నాటి జీవన విధానం..  నేటి తరంలో అగుపించడం లేదు. పచ్చదనానికి పాడె కట్టి, పర్యావరణానికి తూట్లు పొడిచిన ఫలితమే నేడు మానవాళి అనుభవిస్తున్న చేదు పరిణామాలకు మూలకారణం. కృత్రిమ వాతావరణంలో, కాలుష్య కారకాల మధ్య  నిరంతరం అష్టకష్టాలు పడుతూ, ఆరోగ్యాలు చెడి, అంటువ్యాధుల బారిన పడి అలమటిస్తున్న జనం ఆవేదనలు, ఆక్రందనలే నేడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. 

కాలుష్య కారకాలు విజృంభించడంతో..
కాలుష్యకారకాలు విజృంభించడం భూఉష్ణోగ్రతలు  భరింపశక్యం కాకుండా పెరగడం ఊహాతీతమైన   ప్రకృతి విలయాలకు సంకేతం. ఆధునిక పరిజ్ఞానం ప్రజల ఆరోగ్యాలపై పెను ఋప్రభావం చూపుతోంది. మోడ్రన్​ టెక్నాలజీ  జనావాసాలను కాంక్రీటు అరణ్యాలుగా మారుస్తున్నది. చెరువులు, ఇతర నీటి వనరులు నశించిపోతున్నాయి. సముద్ర జలాలు కలుషితమై సముద్ర జీవాలు అంతరించి పోతున్నాయి. ప్రకృతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు జీవవైవిధ్యానికి ముప్పుగా మారాయి. ఈ పరిణామాలను ఐక్యరాజ్యసమితి నాలుగున్నర దశాబ్దాల క్రితమే ఊహించింది.1972 వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణం పై రూపొందించిన  స్టాక్ హోం  డిక్లరేషన్​లో అనేక ప్రతిపాదనలు చేసింది. మనకున్నది ఒకే ఒక సురక్షిత ప్రదేశం భూగ్రహం. మానవ చర్యలతో భూగ్రహం అంతరించి పోతే ఇతర గ్రహాల్లో తిష్ట వేయవచ్చనే ఆశ అత్యాశే కాగలదు. ఎన్నో ఏండ్ల నుంచి ఇతర గ్రహరాశుల్లో జీవరాశుల మనుగడ గురించి అన్వేషిస్తున్నా, ఆశించిన ఫలితం దక్కలేదు. మిలియన్ సంవత్సరాల క్రిందట కొన్ని గ్రహాల్లో నీరుందని, వాటి జాడలు కనిపించాయని చెప్పడానికే ప్రపంచ పరిశోధనలు వినియోగపడ్డాయి. వేలాది కోట్ల రూపాయలతో  ఇతర గ్రహరాశుల గమ్యం గురించి పరిశోధనలు చేస్తున్న పలు దేశాలు మానవ నివాసయోగ్యమైన భూగ్రహ  సంరక్షణ పై దృష్టి సారించడం శ్రేయస్కరం.

పర్యావరణ పరిరక్షణకై..
ఒకవైపు ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరువులో ఉంది. మరోవైపు ప్రకృతితో మమేకమై మనతో పాటు జీవించే పలుజీవరాశులు  అంతర్ధానమై పోయాయి. మానవ తప్పిదాలు మానవ మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకై విరివిగా మొక్కల పెంపకం చేపట్టాలి. కాలుష్య కారకాలను అరికట్టి వాతావరణ సమతుల్యతను కాపాడాలి. ‘గ్లోబల్ వార్మింగ్’ వంటి సమస్యలపై దృష్టి సారించాలి. ఇతర జీవరాశుల మనుగడకు మార్గం చూపాలి. కాలుష్యాన్ని వెదజల్లే వాహన వినియోగాన్ని తగ్గించాలి. కాలుష్య రహితమైన  సాధనాలను వినియోగించాలి. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కలిగించాలి. పర్యావరణాన్ని కాపాడాల్సిన సమిష్ఠి బాధ్యతను గుర్తించాలి. అంతర్జాతీయ సమాజం పర్యావరణ పరిరక్షణ పై విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలి.

పర్యావరణ సంరక్షణ సమష్ఠి బాధ్యత..
పర్యావరణ పరిస్థితులపై దృష్టి సారించకపోతే  ఇప్పటికే ప్రమాదపు అంచున ఉన్న  ప్రపంచ మానవాళి తన మనుగడను కోల్పోయే రోజులు సమీపిస్తున్నాయి. పచ్చదనాన్ని పెంచి, పర్యావరణాన్ని పరిరక్షించడం లోనే సకల మానవాళి క్షేమంగా మనుగడ సాగించగలదు. పచ్చదనం ప్రాధాన్యత చాటి చెప్పాలి. ఒక వైపు మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి చెబుతూనే, మరో వైపు చెట్లను నరికేస్తున్నారు. ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్నాయి. ప్రజల్లో చైతన్యం కోసం పలు కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ పర్యావరణం గురించి, పచ్చదనం  ఆవశ్యకత గురించి పదే పదే చెబుతూనే ఉన్నా అవన్నీ కేవలం మాటల వరకే పరిమితమౌతున్నాయి. సందర్భానుసారంగా మొక్కుబడిగా మొక్కలను నాటి, వాటి సంరక్షణను గాలికొదిలేయడం వలన మొక్కలు నాటే కార్యక్రమాలు నగుబాటుకి లోనవుతున్నాయి. లక్ష్యసిద్ధికోసం చిత్తశుద్ధి అవసరం. పర్యావరణ సంరక్షణ సమష్ఠి బాధ్యత. ప్రపంచంలో తలెత్తే పలు సమస్యలకు పర్యావరణ విధ్వంసమే మూలకారణం.

- సుంకవల్లి సత్తిరాజు, సోషల్ ఎనలిస్ట్