
హైదరాబాద్, వెలుగు: రిజిస్టర్కానీ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా వెలువడే నకిలీ జాబ్ఆఫర్లతో మోసపోతున్నవారి సంఖ్య పెరిగిందని విదేశీ వ్యవహారాల శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి పొందకుండానే కొన్ని ఏజెన్సీలు ఉద్యోగార్థుల వద్ద రూ. 2 నుంచి 5 లక్షల దాకా అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. ఈ నకిలీ ఏజెన్సీలకు చెందినవారు ఫేస్బుక్, వాట్సప్ ఇతర మాధ్యమాల ద్వారా మెసెజెస్, కాల్స్ చేస్తారని.. అందువల్ల కాలర్ వివరాలను, జాబ్ డీటేయిల్స్ కనుక్కోవడం కష్టంగా మారిందని వివరించింది.
రెగ్యూలర్ గా నకిలీ జాబ్ ఆఫర్లతో ఆకర్షిస్తారని, ప్రమాదకర ఉద్యోగాల్లో జాయిన్ చేయిస్తారని చెప్పింది. ఈస్ట్ యూరోపియన్కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, ఇజ్రాయెల్, కెనడా, మయన్మార్ తదితర దేశాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. లైసెన్స్ పొందిన ఓవర్సీస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారానే విదేశాలకు వెళ్లాలని ఉద్యోగార్థులకు సూచించింది. లైసెన్సుడ్ ఏజెన్సీలలో ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 1983 ప్రకారం.. 30 వేలు, 18 శాతం జీఎస్టీ మాత్రమే వసూలు చేస్తారని తెలిపింది. చెల్లించిన దానికి రిసీప్ట్ కూడా ఇస్తారని వివరించింది. అనుమతిలేని రిక్రూట్మెంట్ ఏజెన్సీలను వదలబోమని ప్రభుత్వం హెచ్చరించింది.