బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’ (Dhurandhar). స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రోజు రోజుకూ వసూళ్లను అమాంతం పెంచుతూ గత సినిమాల రికార్డులను సరిచేస్తోంది. ఆదిత్యధర్ తెరకెక్కించిన 'ధురంధర్'.. డిసెంబర్ 5న రిలీజై, కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ మార్కును దాటింది. ఈ క్రమంలో రిలీజైన పదిరోజుల్లోనే ఈ చిత్రం రణ్‌వీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ ‘సింబా’ లైఫ్‌టైమ్ కలెక్షన్లను బద్దలుకొట్టింది.
ఇప్పటివరకు 'ధురంధర్' సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో ధురంధర్ ప్రస్తుతం రూ.500 కోట్ల మార్క్ వైపునకు దూసుకుపోతోంది. ఇండియా వైడ్గా రూ.351.75 కోట్ల నెట్ సాధించనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియా వైడ్ నెట్ వసూళ్లు గమనిస్తే.. డే1 నుంచి డే10 వరకు లెక్కలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే ఊపు ఈ వీకెండ్ కూడా కొనసాగితే.. త్వరలోనే రజనీకాంత్ 'కూలీ (రూ.518 కోట్లు), 'సయ్యారా (రూ.569.75 కోట్లు) సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇండియా రోజువారీ నెట్ వసూళ్లు:
- ఫస్ట్ డే (డిసెంబర్ 5) శుక్రవారం= రూ. 28.60 కోట్లు
- సెకండ్ డే = శనివారం రూ. 33.10 కోట్లు
- థర్డ్ డే = ఆదివారం రూ.43 కోట్లు
- నాలుగో రోజు = మొదటి సోమవారం రూ.23.25 కోట్లు
- ఐదో రోజు = మంగళవారం రూ. 27 కోట్లు
- ఆరో రోజు = బుధవారం రూ.27 కోట్లు
- ఏడో రోజు = గురువారం రూ.27 కోట్లు
- ఎనిమిదో రోజు = శుక్రవారం రూ.32.5 కోట్లు
- తొమ్మిదో రోజు = శనివారం రూ. 53 కోట్లు
- పదో రోజు = ఆదివారం ఏకంగా రూ.59 కోట్లు
మొత్తం పదిరోజుల్లో= రూ.351.75 కోట్ల నెట్ సాధించింది.
దాదాపు ఏడాది విరామం తర్వాత వెండితెరపైకి వచ్చిన రణ్‌వీర్, ఇందులో మునుపెన్నడూ చూడని క్రూరమైన, తీవ్రమైన అవతార్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. రణ్‌వీర్‌ను గుర్తుపట్టలేనంతటి భయంకరమైన లుక్‌తో ఆకట్టుకున్నారు. ఆయనలోని అపారమైన శక్తి, తీవ్రత క్షణాల్లోనే ఈ గ్రిట్టీ యాక్షన్ డ్రామాకు టోన్ సెట్ చేశాయి. రణ్‌వీర్ సింగ్ మేకోవర్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. దేశంలో అత్యంత శక్తివంతమైన నటులలో ఒకరిగా అతని స్థానాన్ని ఈ మూవీ మరోసారి నిరూపించిందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
కథ:
1999లో జరిగిన ఐసి–814 విమాన హైజాక్, ఆ తర్వాత 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. పాకిస్థాన్ టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌ను అంతం చేయడానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) ఓ యువకుడిని రంగంలోకి దింపుతాడు. అతనే పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని భారత ఏజెంట్‌గా హమ్జా (రణ్‌వీర్ సింగ్) అనే మారుపేరుతో పాక్‌లోకి పంపుతాడు.
అక్కడ అతను ఎలాంటి పోరాటం చేశాడు? ఎదురైన సవాళ్లేంటి? కరాచీ అండర్ వరల్డ్ మాఫియా రెహమాన్ బలోచ్ (అక్షయ్ ఖన్నా)ని ఎలా అంతం చేశాడన్నది మూవీ మెయిన్ కాన్సెప్ట్. దీనికితోడు ఇందులో సంజయ్‌దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు ఏంటనేది సస్పెన్స్.
