బాసర ఆలయంలో భక్తుల నుంచి దోపిడీ చేస్తున్రు!

బాసర ఆలయంలో భక్తుల నుంచి దోపిడీ చేస్తున్రు!
  • టెండర్​దారుల అడ్డగోలు వసూళ్లు
  • ఫోన్​ పెట్టేందుకు, ఫొటోలకు, కొబ్బరి నీళ్లకు అదనపు రేట్లు
  • భక్తులను తనిఖీ చేసి మరీ వసూలు
  • చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ఆఫీసర్లు

భైంసా, వెలుగు:  ప్రసిద్ధ క్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో టెండర్​దారులు భక్తులను నిలువుగా దోపిడీ చేసేస్తున్నారు. ​ఫోన్​పెట్టేందుకు దక్కించుకున్న టెండర్​తోపాటు ఆలయంలో ఫొటోలు తీసి ఇవ్వడానికి, పువ్వులు విక్రయించేందుకు, కొబ్బరి కాయల టెండరుదారులు అక్రమ ఆర్జనకు పాల్పడుతున్నారు. ఈ దందా కొద్ది రోజులుగా యథేచ్ఛగా సాగుతున్నా ఆలయ ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. తెలిసినా పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అమ్మవారి చెంతకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. తమ చిన్నారులకు ఇక్కడ అక్షరభ్యాసం చేయిస్తే విద్యావంతులవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుంటున్న టెండరుదారులు దేవాదాయ శాఖ రూల్స్​ను బ్రేక్​చేసి దోపిడీ చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. 

ముద్రించి మరీ వసూళ్లు..

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో కొబ్బరి కాయలు కొట్టేందుకు, సెల్ ఫోన్లు భద్రపర్చేందుకు, భక్తుల ఫొటోలు తీసి ఇవ్వడానికి ఆఫీసర్లు ఏటా టెండర్లు పిలుస్తుంటారు. వీటిని దక్కించుకున్నవారు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. దేవాదాయ శాఖ రూల్స్​మేరకు భక్తుల నుంచి ఫీజులు తీసుకోవాల్సి ఉంది.  ఫోన్​భద్రపర్చేందుకు ఒక్కోదానికి రూ.10కి బదులు రూ. 20 వసూలు చేస్తున్నారు. ఇదీ కూడా రిసిప్ట్ లో రూ. 20 ముద్రించి మరీ భక్తుడికి ఇస్తున్నారు. కొందరు భక్తులు తెలియకుండా ఫోన్లను ఆలయంలోకి తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో టెండరుదారు ఇద్దరు, ముగ్గురు వ్యక్తులను నియమించి భక్తుల బ్యాగులను తనిఖీలు చేస్తున్నారు. ఫోన్​ఉంటే ఏకంగా మూడింతల వసూలు చేస్తూ భక్తులను ఇబ్బంది పెడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే రూ.లక్షలు పెట్టి టెండరు వేసినం.. ఇవ్వాల్సిందే.. అంటూ హెచ్చరిస్తున్నారు. 

కొబ్బరి నీళ్లకూ డబ్బులే...

 కొబ్బరి కాయలు కొట్టేందుకు దక్కించుకున్న టెండరుదారు కూడా తక్కువేం కాదు. భక్తులు తెచ్చిన కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అర చిప్ప భక్తుడికి, మరొకటి టెండరుదారుడికి ఇస్తారు. ఇదంతా బాగానే ఉన్నా కొబ్బరి నీళ్లు భక్తులకు ఇవ్వకుండా వాటర్​బాటిళ్లలో నింపి లీటర్ కు రూ. 50 నుంచి రూ. 80 వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమే అంటున్నారు. ఆలయం లోపల ఫోన్లకు అనుమతి లేక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఫోటోలకు టెండరు దక్కించుకున్న రూల్స్​ప్రకారం ఒక్కో ఫొటోకు రూ. 80 తీసుకోవాల్సి ఉండగా రూ.100 వసూలు చేస్తున్నారు. భక్తులు చేసేదేమి లేక ఫొటోలు దిగుతున్నారు. అది కూడా క్వాలిటీ ఫొటోలు ఉంటలేవంటున్నారు. 

చర్యలు తీసుకుంటాం...

ఆలయంలో టెండరు దక్కించుకున్నవారు భక్తుల నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఫోన్​ల విషయం ఇటీవలే తెలిసింది.  హెచ్చరించాం. అయినా తీరు మారకుంటే చర్యలు తీసుకుంటాం. మిగతా టెండరు నిర్వహణపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటాం. భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఫిర్యాదు చేయాలి.

– విజయరామారావు, ఆలయ ఈవో

కొబ్బరి నీళ్లకు రూ. 80 ఇచ్చిన..

బాసర ఆలయంలో మొక్కుగా కొబ్బరికాయలు కొట్టాం. కొబ్బరి నీళ్లు మాకు ఇవ్వలే. చిన్నారుల కోసం లీటర్ కొబ్బరి నీళ్లు రూ. 80 అడిగారు. తప్పని పరిస్థితుల్లో ఇచ్చిన. భక్తులను టెండరుదారు నిలువు దోపిడీ చేస్తున్నరు. చర్యలు తీసుకోవాలె.

- భానుప్రసాద్, భక్తుడు