ఫేక్ బుకింగ్ లలతో నీళ్ల దోపిడీ

ఫేక్ బుకింగ్ లలతో నీళ్ల దోపిడీ
  •     వాటర్ బోర్డు ఫిల్లింగ్ స్టేషన్లలో సిబ్బంది దందా
  •     ఆర్డర్ ఇవ్వకున్నా వేరే ఫోన్ నంబర్లతో బుకింగ్​ చేస్తూ..
  •     హోటళ్లు, హాస్టళ్లు, వాణిజ్య అవసరాలకు ఎక్కువకు అమ్ముకుంటూ.. 
  •     రోజుకు రూ. లక్షల్లో వాటర్ బోర్డు ఆదాయానికి గండికొడుతున్నరు 
  •     మరోవైపు నీటి కొరత ఉందంటూ అక్రమార్కుల  ప్రచారం
  •     కొందరు సిబ్బంది గుట్టు బయటపడగా వేరే చోటకు బదిలీ

హైదరాబాద్,వెలుగు :  సిటీలో పెరిగిన వాటర్ డిమాండ్ ​వాటర్ బోర్డు సిబ్బందిలో కొందరికి కాసులు కురిపిస్తోంది. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీకి తామేం తీసిపోమని బోర్డు ట్యాంకర్ల ఫిల్లింగ్​ స్టేషన్లలో  సిబ్బంది చేతివాటం చూపుతున్నట్టు అధికారులు గుర్తించారు. సిటీలో నీటి కొరతను సృష్టించిన కొందరు లైన్​మెన్లపై కంప్లయింట్లు వెళ్లడంతో ఉన్నతాధికారులు ముగ్గురిపై వేటు వేసినది తెలిసిందే. 

తాజాగా వాటర్​ ఫిల్లింగ్ స్టేషన్లలో కొందరు సిబ్బంది నీటి కొరత పేరుతో భారీగా ట్యాంకర్లను పక్కదారి పట్టిస్తూ దొరికిపోయారు.  అధికారులు వారిని ఇతర విభాగాలకు బదిలీ చేసినట్టు తెలిసింది. ఇలా నీటి డిమాండ్​ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడు తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్క సిటీ పరిధిలో భూగర్భ జలాలు ఎండిపోయి నీటి డిమాండ్​పెరిగింది. మరో పక్కపెరిగిన డిమాండ్​కు అనుగుణంగా అధికారులు ట్యాంకర్ల సంఖ్యను పెంచి వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. 

పెరిగిన డిమాండ్ దృష్ట్యా..

వాటర్​ బోర్డు పరిధిలో 78 ​ఫిల్లింగ్​స్టేషన్లు ఉండగా.. సిటీతో పాటు ఔటర్ పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలకు నీటిని సరఫరా చేస్తోంది. ప్రస్తుతం 706  ట్యాంకర్ల ద్వారా రోజుకు 7 వేల ట్రిప్పులు నడుస్తున్నాయి. గత మార్చి లో మొత్తం1.69 లక్షల ట్యాంకర్ల నీటి సరఫరా చేశారు. ప్రస్తుత ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు 2.50 లక్షల ట్రిప్పుల నీటి సరఫరా చేసినట్టు అధికారులు తెలిపారు. పెరిగిన డిమాండ్​ను దృష్టిలో పెట్టుకుని రాత్రింబవళ్లు సరఫరా చేస్తుండగా.. కొందరు సిబ్బంది నకిలీ బుకింగ్స్​ చేస్తూ.. ట్యాంకర్లను పక్కదారి పట్టిస్తున్నట్టు తెలిసింది. 

దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో కొందరు సిబ్బందిని వేరే సెక్షన్లకు బదిలీ చేశారు. ఫిల్లింగ్​స్టేషన్లలో కొందరు ఇన్​చార్జ్ లు100 మంది ఫోన్​ నంబర్లను సేకరించి, వారి తరపున ట్యాంకర్లను బుక్​చేస్తున్నట్టు తేలింది. ఓటీపీ తెలుసుకుని బుక్ ​చేసిన ట్యాంకర్లను హోటళ్లు, హాస్టళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు తరలించి ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఇలా నంబర్లు సేకరించిన వారికి అప్పుడప్పుడు ట్యాంకర్లను పంపుతున్నట్టు సమాచారం.  కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి బాగోతం నడుస్తున్నట్టు తెలిసింది. 

ఎలా బయటపడిందంటే..

రోజుకు వేల సంఖ్యలో ట్యాంకర్లను డెలివరీ చేస్తున్నా, ఇంకా పెండెన్సీ ఉంటుండడం అధికారులు గుర్తించారు. బుక్ ​చేసిన వారికి ఒకటి లేదా రెండు రోజుల్లో ట్యాంకర్ ​సరఫరా చేస్తున్నారు. కానీ రోజుకు 9 నుంచి 10వేల వరకు పెండింగ్ ​చూపిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అంటే రోజుకు అధికారిక లెక్కల ప్రకారం 7 వేల ట్యాంకర్లను సరఫరా చేస్తున్నా.. ఇంకా 10వేలు పెండింగ్​ ఉండడం ఏంటని అధికారులు ఆరా తీయగా.. కొందరు సిబ్బంది ఫేక్​ బుకింగ్​లు చేస్తున్నట్టు తేలింది. రోజుకు 4  నుంచి 5వేల ఫేక్ ​బుకింగ్​లు చేసి దాదాపు రూ. 15లక్షల వరకు వాటర్ బోర్డు ఖజానాకు గండి కొడుతున్నట్టు గుర్తించారు. దీంతో అక్రమాలకు పాల్పడుతున్న కొందరు సిబ్బందిని వెంటనే ఇతర సెక్షన్లకు బదిలీ చేసినట్టు సమాచారం.

ఒకే సెక్షన్ లో  ఏండ్లుగా విధులు

వాటర్ బోర్డు పరిధిలోని కొన్ని ఫిల్లింగ్​స్టేషన్లలో సిబ్బందికి డ్యూటీలు కాసులు కురిపిస్తున్నట్టు, రూ. లక్షల్లో ఆదాయం దండుకుంటునట్టు తెలిసింది. చాలా ఫిల్లింగ్​స్టేషన్లలో దాదాపు 30 మంది సిబ్బంది ఐదేండ్లకు పైగానే ఒకే సెక్షన్​లో విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ఒకే చోట పాతుకుపోవడంతో అక్రమాలకు ఈజీ అయింది. ఎవరికీ అనుమానం రాకుండా నీటి ట్యాంకర్ల సరఫరాలోనూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో త్వరలోనే బోర్డు పరిధిలోని 78 ఫిల్లింగ్​స్టేషన్లలో సిబ్బందిని బదిలీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.