లాక్​డౌన్ సమయంలో టెర్రరిజం పెరిగే ప్రమాదం

లాక్​డౌన్ సమయంలో టెర్రరిజం పెరిగే ప్రమాదం
  • ఆందోళన వ్యక్తం చేసిన యూఎన్ చీఫ్

న్యూయార్క్: ఆన్​లైన్లో టెర్రరిస్టుల రిక్రూట్​మెంట్ జరుగుతోందని, కరోనా ఎఫెక్టు టైంను టెర్రరిస్టు గ్రూపులు ఉపయోగించుకుంటున్నాయని యునైటెడ్ నేషన్స్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. యువకుల నిరాశ, ఆసహనం, కోపాన్ని ఆసరాగా చేసుకుని ఆన్​లైన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభం సమయంలో ఒక తరాన్ని మనం కోల్పోకూడదని సూచించారు. ఐదేళ్ల ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించి ఒక తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత గుటెరస్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇప్పటికే అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటున్న యువత లాక్​డౌన్ నేపథ్యంలో ఇండ్లలో ఎక్కువ సమయం ఆన్​లైన్లలో గడుపుతున్నారని, అలాంటి వాళ్లను ఆకర్షించేందుకు టెర్రరిస్టు గ్రూపులు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఇలాంటి కష్ట సమయంలో తీవ్రవాదం మరింత పెరిగే అవకాశాలున్నాయన్నారు.
ప్రతి ఐదుగురు యువతలో ఒకరు విద్యనభ్యసించడం లేదని, వారికి ట్రైనింగ్ గానీ, ఉపాధిగానీ లేవని, ప్రతి నలుగురులో ఒకరు హింసకు గురవుతున్నారని గుటెరస్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నవారు అనేక సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ కావడం వల్లే రాజకీయ వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం క్షీణిస్తోందని అన్నారు. కరోనా ప్రభావం 1.54 బిలియన్లకు పైగా పిల్లలు, యువతపై తీవ్రంగా పడుతోందన్నారు. ఇప్పుడున్న సంక్షోభం, దాని పర్యవసానాలను పరిష్కరించడానికి యువత ప్రతిభను ఉపయోగించుకోవడానికి దేశాలు మరింత కృషి చేయాలని గుటెరస్ పిలుపునిచ్చారు.