
- మూడు రోజుల కింద కొత్తగూడెం హెడ్డాఫీస్ లో ప్రారంభం
- త్వరలో జీఎం ఆఫీసులు, ఆస్పత్రులు, స్టోర్స్, గనులకు విస్తరణ
- ఫ్రీ మస్టర్లకు చెక్ పెట్టేందుకు సింగరేణి యాజమాన్యం ప్లాన్
కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణిలో ఆఫీసర్లు, ఉద్యోగులకు కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. దీన్ని కొత్తగూడెంలోని సంస్థ హెడ్డాఫీసులో మూడు రోజులు కింద పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. దీని ద్వారా సమయ పాలనకు ప్రాధాన్యత ఉంటుందని పారదర్శకత పెరుగుతుందని యాజమాన్యం పేర్కొంటుంది.
మరోవైపు ఫ్రీ మస్టర్ వ్యవహారానికి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ ను సంస్థ అమల్లోకి తెచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ఇప్పటికే సింగరేణివ్యాప్తంగా ఆఫీసులు,డిపార్ట్ మెంట్లలో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలవుతోంది. సంస్థకు 22 అండర్ గ్రౌండ్,16 ఓపెన్కాస్ట్మైన్లు ఉన్నాయి. వీటిలో 41 వేల మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తున్నారు.
డ్యూటీకి రాకుండానే అటెండెన్స్ పడుతుండగా..
ఇప్పటికే సంస్థలో ఉద్యోగులు, కార్మికులు నంబర్(ఎంప్లాయ్కోడ్) చెబితే గని ఆఫీస్‌ల్లో క్లర్కులు ఇన్, ఔట్ హాజరు నమోదు చేసే పద్ధతి ఉంది. తద్వారా మస్టర్ వేసేవారితో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకుని, చాలా మంది డ్యూటీకి రాకుండానే అటెండెన్స్ వేయించున్నట్లు ఎంక్వైరీలో తేలింది. దీన్ని నిరోధించేందుకు యాజమాన్యం బయోమెట్రిక్ ను ప్రవేశపెట్టింది. అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ మైన్లు మినహా సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ లో, 11 ఏరియాల్లోని జీఎం ఆఫీసులు, 9 ఏరియా ఆస్పత్రులు, సివిల్, వర్క్ షాప్స్, స్టోర్స్, విద్యుత్ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం అమలులో ఉంది.
దీన్ని కొవిడ్ సమయంలో టెంపరరీగా నిలిపివేశారు. 2023 ఆగస్టు నుంచి మళ్లీ అమలవుతోంది. సుమారు11వేలకుపైగా ఉద్యోగులు, కార్మికులకు తప్పనిసరిగా హాజరుపడాల్సి ఉంటుంది. డ్యూటీలకు వచ్చే టైమ్, వెళ్లే టైమ్ లోనే హాజరు నమోదు చేస్తారు.ప్రతి ఒక్కరూ 8 గంటలు డ్యూటీలు చేయాలి. మధ్యలో సిస్టమ్ అటెండెన్స్ తీసుకోదు. బయోమెట్రిక్ ద్వారా క్లర్కుల అవసరం కూడా తగ్గిపోయింది. కార్మికులు,ఉద్యోగులు ఎక్కువగా ఉండే అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ మైన్లలో పాత పద్ధతిలోనే క్లర్క్ ల ద్వారా స్వైప్ సిస్టమ్ లో మస్టర్ పడే విధానమే ఇంకా కొనసాగుతోంది.
ఫేషియల్ రికగ్నైజేషన్ పై ఫోకస్
ఫేషియల్ రికగ్నైజేషన్ విధానంపై స్టడీ చేసేందుకు గతేడాది మే సెంట్రల్ కోల్ ఫీల్డ్స్లిమిటెడ్(సీసీఎల్, -జార్ఖండ్) కు సింగరేణి పర్సనల్, ఐటీ వింగ్ అధికారులు, కార్మిక సంఘాల లీడర్లతో ఒక టీమ్ ను సంస్థ పంపించింది. అక్కడి బొకారో, కర్గాలీ ఏరియాల్లోని ఓసీపీలో ఫేషియల్ రికగ్నైజేషన్ మస్టర్ ఇన్, ఔట్ అటెండెన్స్ ను పరిశీలించి నివేదికను సింగరేణికి అందించింది. ఏడాది తర్వాత హెడ్డాఫీసులో ఎగ్జిక్యూటివ్స్, ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగుల ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ప్రారంభించింది. హైదరాబాద్‌లోని మెస్సర్స్ సెల్ఫీ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు నిర్వహణ బాధ్యతను ఇచ్చింది.
కొన్నాళ్ల కింద ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ కొత్తగూడెం ఏరియా వీకే- – 7 అండర్ గ్రౌండ్మైన్ లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది. కార్మికుల నుంచి వ్యతిరేకతతో పూర్తిగా అమలులోకి తేలేదు. ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ద్వారా ఉద్యోగులు,ఆఫీసర్లు డ్యూటీలకు హాజరైతేనే మస్టర్ నమోదవుతుంది. ఒకరిహాజరు మరొకరు చెప్పే చాన్స్ కూడా లేదు. ముందుగా ఉద్యోగుల ఫొటోలను సిస్టమ్ లో అప్ లోడ్ చేస్తారు. డ్యూటీకి వచ్చేముందు మెషీన్ ముందు చూస్తేనే హాజరును నమోదవుతుంది.
ఫ్రీ మస్టర్లకు చెక్ పెట్టేందుకు..
గనుల్లో పనిచేయకుండానే ఫ్రీ మస్టర్లు పొందే ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు10 –15 మందికి మస్టర్లు పడుతుండగా.. వారంతా పని చేయకుండానే ఇండ్లకు వెళ్తున్నట్లుగా గుర్తించారు. కార్మిక సంఘాలకు సంబంధించిన పిట్ నుంచి ఏరియా స్థాయి పదవుల్లోని నేతలు, అనుచరులు అధికంగా ఫ్రీ మస్టర్ పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటివారు గంట కూడా పని చేయకుండా సొంత పనులు చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి.
సింగరేణిలో రోజుకు 150 – 200 మంది వరకు ఫ్రీ మస్టర్లు పొందినట్లు లెక్కలున్నాయి. ఒక్కో మస్టరుపై రూ.3వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. వీటి కారణంగా రోజుకు రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు సంస్థకు నష్టం వాటిల్లుతుంది. ఇకముందు ఫ్రీ మస్టర్లకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ విధానం యాజమాన్యం తెచ్చింది. ప్రస్తుతం సుమారు30వేల మందికిపైగా కార్మికులు, ఉద్యోగులు అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల్లో వీలును బట్టి భవిష్యత్ లో బయోమెట్రిక్ లేదా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అమలు చేసే వీలున్నట్లు ప్రచారంలో ఉంది.