పల్లె ప్రగతి ప్లే గ్రౌండ్​లలో సౌలతులు లేక నిరుపయోగం

పల్లె ప్రగతి ప్లే గ్రౌండ్​లలో సౌలతులు లేక నిరుపయోగం

మహబూబ్​నగర్​/నవాబ్​పేట, వెలుగు :  పల్లె ప్రాంతాలకు చెందిన క్రీడాకారులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు పనికి రాకుండా పోతున్నాయి. 5వ విడత పల్లె ప్రగతి కింద నిరుడు జూన్​ 3న వీటిని ప్రారంభించగా, ఇప్పటి వరకు సౌలతులు కల్పించలేదు. దీంతో క్రీడాకారులు ఆటలాడుకునేందుకు, ఎక్సర్​సైజ్​లు చేయడానికి రావడం లేదు.

సౌలతుల్లేవ్..

జిల్లాలో 262 ప్లే గ్రౌండ్స్​ను ఏర్పాటు చేయగా, చాలా  చోట్ల ఫెసిలిటీస్​ కల్పించ లేదు. ప్రతి ప్లే గ్రౌండ్​లో షార్ట్​ పుట్, లాంగ్​ జంప్, సింగిల్​బార్, డబుల్ బార్​, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్  కోర్టులు, వాకింగ్​, రన్నింగ్​ ట్రాక్స్​ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, చాలా చోట్ల వీటిని ఏర్పాటు చేయలేదు. కొన్ని  చోట్ల కేవలం సింగిల్ బార్, డబుల్​ బార్​లను మాత్రమే ఏర్పాటు చేసి వదిలేశారు. ఈ సౌకర్యాలన్నీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలతో చేయించాల్సి ఉంది. సొంత డబ్బుతో వీటిని ఏర్పాటు చేసి, తరువాత బిల్లులు పెట్టుకోవాల్సి ఉండడంతో ఎవరూ ఈ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే జీపీల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాక తిప్పలు పడుతున్నామని, మళ్లీ డబ్బులు పెట్టి పనులు చేయించడం తమ వల్ల కాదని అంటున్నారు. 

పాలమూరులో ఇదీ పరిస్థితి..

ఎన్ఆర్​ ఈజీఎస్​ కింద పాలమూరు జిల్లాలో 441 గ్రామ పంచాయతీలుండగా, వీటి పరిధిలో 665 ప్లే గ్రౌండ్స్​ను ఏర్పాటు చేయడానికి ఆఫీసర్లు ప్రతిపాదనలు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 262 గ్రౌండ్స్​​మాత్రమే ఏర్పాటు చేశారు. మిగిలిన 403 ప్లే గ్రౌండ్స్​ ఏర్పాటు చేసేందుకు ల్యాండ్​ దొరకడం లేదు. వీటి నిర్మాణాలకు రూ.4.20 లక్షల నుంచి రూ.4.50 లక్షల వరకు ఫండ్స్​ కేటాయిస్తున్నారు. 

ఊళ్లకు దూరంగా..

ప్లే గ్రౌండ్స్​కు ప్రభుత్వ భూములు దొరక్కపోవడంతో ఆఫీసర్లు ఎక్కడపడితే అక్కడ వీటికి స్థలాలు కేటాయించారు. కొన్ని ఊళ్లల్లో ప్రభుత్వ స్కూళ్లకు చెందిన గ్రౌండ్స్​నే వీటికి కేటాయించారు. గ్రామాల్లో ఉండే రియల్​ ఎస్టేట్​ వెంచర్లలో గ్రామ పంచాయతీలకు అప్పగించిన 10 శాతం ల్యాండ్స్​లో వీటిని ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో అయితే కిలోమీటరు, అర కిలోమీటర్​ దూరంలో వీటిని కట్టించారు. ఇవి కాకండా కొందరు రైతుల పొలాల్లో వీటిని ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది.  దీనికితోడు చాలా గ్రౌండ్​లను చదును చయలేదు. భూమి ఎత్తు, తగ్గులు ఉండటంతో అక్కడ ఆటలాడుకోవడానికి ఎవరూ రావడం లేదు.

హాస్పిటల్​ గ్రౌండ్​లోనే..

చిన్నప్పటి నుంచి జాగింగ్​ చేయడం అలవాటు. ప్లే గ్రౌండ్​ ఏర్పాటు చేయడంతో అక్కడ జాగింగ్​ చేయవచ్చు అనుకున్నా. కానీ, గవర్నమెంట్​ హాస్పిటల్​లో ఉన్న కొంత భూమిని ప్లే గ్రౌండ్​ను అలాట్​ చేశారు. అక్కడ జాగింగ్​ చేసేందుకు అవకాశం లేకపోవడంతో, రోడ్డుపైనే జాగింగ్​ చేస్తున్నా.

- సతీశ్​ గౌడ్, మణికొండ​

ప్లే గ్రౌండే కాదు..

మా ఊళ్లో కొద్ది రోజుల కింద ప్లే గ్రౌండ్​ను ప్రారంభించారు. పొలాలకు వెళ్లే దారిలో జాగ కేటాయించిన్రు. ఎకరా స్థలం కూడా లేదు. సింగిల్, డబుల్​ బార్​లు ఏర్పాటు చేసి వదిలేశారు. మట్టి చదును కూడా చేయలేదు. ఈ గ్రౌండ్​లో ఖోఖో, కబడ్డీ ఆడితే దెబ్బలు తగలడం ఖాయం.

- మహేందర్, దేపల్లి