శబరిమలలో తెలంగాణ భవన్‌ను ఏర్పాటు చేయాలి : రాజాసింగ్

 శబరిమలలో తెలంగాణ భవన్‌ను ఏర్పాటు చేయాలి : రాజాసింగ్

శబరి వెళ్లే అయ్యప్ప స్వాములకు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ కోరారు. తెలంగాణ, ఆధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మంది అయ్యప్పస్వాములు శబరిమలైకి వెళతారుని,  అక్కడ తాగునీరు, పార్కింగ్ సదుపాయం లేక భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పారు.  స్వాములకు అన్నప్రసాదం చేద్దామన్న కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్నారు రాజాసింగ్.  

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో  సీఎం రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనతో మాట్లాడి అయ్యప్ప భక్తులకు భోజన వసతి, తాగునీరు సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  ఢిల్లీ తరహాలో కేరళలో కూడా తెలంగాణ భవన్‌ను ఏర్పాటు చేయాలని  ప్రభుత్వాన్ని  కోరారు రాజాసింగ్.  అక్కడ ఐదు నుంచి పదిహేను ఎకరాల స్థలం తీసుకోవాలని..  అక్కడ తెలంగాణ భవన్‌ నిర్మిస్తే స్వాములు బస చేసే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.   తెలంగాణ నుంచి వెళ్లిన స్వాములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాజాసింగ్‌ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కొంతమంది దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నారు. లక్షలాది మంది వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గత నాలుగైదు రోజులుగా ( డిసెంబర్​ 14వ తేదీకి) రోడ్లపైనే వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

శబరిమలలో క్యూలైన్ల నిర్వహణలో దేవాలయ అధికారుల నిర్లక్ష్యం వహించారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అయ్యప్ప దర్శనానికి ఎక్కువగా సమయం పడుతుండటంతో కర్ణాటకకు చెందిన భక్తులు పందళంలోని శ్రీధర్మశాస్త ఆలయంలో ఇరుముడి సమర్పించి, అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు.