MLC 2025: డుప్లెసిస్ మెరుపు సెంచరీ.. 40 ఏళ్ళ వయసులో ప్రపంచ రికార్డ్ సమం చేసిన మాజీ సఫారీ కెప్టెన్

MLC 2025: డుప్లెసిస్ మెరుపు సెంచరీ.. 40 ఏళ్ళ వయసులో ప్రపంచ రికార్డ్ సమం చేసిన మాజీ సఫారీ కెప్టెన్

సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వయసుతో సంబంధం లేకుండా టీ20 ఫార్మాట్ లో తన తడాఖా చూపిస్తున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా 40 ఏళ్ళ వయసులో ప్రపంచ రికార్డ్ ను సమం చేయడం విశేషం. టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ డల్లాస్‌ వేదికగా శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఫాఫ్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ తో డుప్లెసిస్ కెప్టెన్ గా 7 సెంచరీలు పూర్తి చేసుకొని టీ20 క్రికెట్ లో ప్రపంచ రికార్డ్ సమం చేశాడు.   

ALSO READ | IND vs ENG 2025: రెండు చేతులకి తిమ్మిర్లు.. నొప్పిని భరిస్తూనే సెంచరీ బాదిన జైశ్వాల్

టీ20 క్రికెట్ లో కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల  లిస్టులో బాబర్ అజామ్, క్లింగర్ తో సమంగా డుప్లెసిస్ నిలిచాడు. బాబర్ అజామ్ కెప్టెన్‌గా 144 మ్యాచ్‌ల్లో ఏడు టీ20 సెంచరీలు సాధించగా.. ఫాఫ్ 202 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ క్లింగర్ కెప్టెన్‌గా కేవలం 120 మ్యాచ్‌ల్లోనే  ఏడు సెంచరీలు సాధించాడు. స్టార్ ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 193 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా ఐదు సెంచరీలతో ఈ ముగ్గురి తర్వాత స్థానంలో ఉన్నాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట  బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్  51 బంతుల్లో 100 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సాయితేజా ముక్కమల్ల 24 బంతుల్లో 38 పరుగులు చేసి సూపర్ కింగ్స్ కెప్టెన్ కు మంచి సహకారాన్ని అందించాడు. లక్ష్య ఛేదనలో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌ కేవలం 16.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు మాథ్యూ షార్ట్ (29 బంతుల్లో 61), ఫిన్ అల్లెన్ (35 బంతుల్లో 78) విజృంభించడంతో 22 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.