
కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. “ఇక్కడేం జరగదు. నేను లండన్ వెళ్లిపోతా. నా పిల్లలు అమెరికాలో చదువుకుంటారు. ఇండియాలో చేయడానికి ఇక నాకేంలేదు. నా దగ్గర వేల కోట్ల ధనముంది. నేనెక్కడికైనా వెళ్లగలను” అని రాహుల్ గాంధీ అన్నట్టుగా.. రాహుల్ గాంధీ లండన్ వెళ్లిపోతున్నాడనే టైటిల్ తో ఓ వీడియో వైరల్ అయింది.
11 సెకన్లున్న ఈ వీడియోను ఫేస్ బుక్ యూజర్ Sanjay Swarup Srivastava పోస్ట్ చేశారు. కొద్దిసేపటికే.. ఈ వీడియో 10వేల షేర్లు పోయింది. ఐతే.. ఆ తర్వాత వీడియో డిలీట్ అయింది. కానీ.. అప్పటికే వైరల్ అయిపోయింది.
బీజేపీ మహిళా మోర్చా సోషల్ మీడియా నేషనల్ ఇంచార్జ్ ప్రీతీగాంధీ ఇదే వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
Namaste London!! ;)) pic.twitter.com/467zWGfRHz
— Priti Gandhi (@MrsGandhi) October 13, 2019
ఇదీ అసలు సంగతి
ఈ వీడియో ఎక్కడిది.. నిజంగానే రాహుల్ గాంధీ అలా అన్నారా అని చాలామంది ఆరా తీశారు. నిజానికి రాహుల్ గాంధీ ఆ మాటలు అనలేదు. రాహుల్ ప్రసంగం నుంచి ఎడిట్ చేసిన వీడియో అది. మహారాష్ట్ర 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా లాతూర్ పబ్లిక్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడిన సందర్భంలోనిది ఆ వీడియో. పంజాబ్ నేషనల్ స్కామ్ కు సంబంధించి నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ దేశాన్ని మోసం చేసి విదేశాల్లో యథేచ్చగా తిరిగారని చెబుతూ.. ఈ మాటలు అన్నారు రాహుల్ గాంధీ. కింద ఉన్న వీడియోలో 14:57 నిమిషాల నుంచి ప్రసంగం వింటే రాహుల్ గాంధీ ఏమన్నారో తెలుస్తుంది. “దేశంలో రైతులు భయంతో బతుకుతున్నారు. లోన్లు ఎలా మాఫీ చేయాలా అని ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ లాంటివాళ్లు మాత్రం ఏ భయం లేకుండా బాగా నిద్రపోతున్నారు. తమనెవ్వరూ ఏమీ చేయలేరని.. తమకేం కాదనే ధీమాతో ఉన్నారు. ఇండియాతో మాకు పనిలేదు. తాము లండన్ వెళ్లిపోవచ్చు. పిల్లలు అమెరికాలో చదువుకోవచ్చు. తమకు వేలకోట్లున్నాయి. ఎక్కడికైనా వెళ్తాం. అనే ధీమాతో ఉన్నారు వాళ్లు” అని రాహుల్ అన్నారు.