ఫేక్ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

ఫేక్ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

జగిత్యాల టౌన్, వెలుగు : ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ నిందితుల వివరాలు వెల్లడించారు. ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన కొడిదల మహేశ్​పాస్ పోర్ట్ నిమిత్తం ఎస్సెస్సీ సర్టిఫికెట్ అవసరం ఉందని.. అదే గ్రామానికి చెందిన కొక్కరకని చంద్రయ్యకు చెప్పాడు. 

తనకి దగ్గరి బంధువైన బత్తినోజు రజితను సంప్రదించి నకిలీ సర్టిఫికెట్ ఇప్పిస్తానని, అందుకు రూ.28 వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం మహేశ్​కు చంద్రయ్య నకిలీ సర్టిఫికెట్ ఇప్పించాడు. పాస్ పోర్ట్ విచారణలో ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ నర్సింగరావు అది నకిలీదిగా గుర్తించారు. బత్తినోజు రజిత, శ్రావణ్ దంపతులు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ జీవిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పశ్చిమ బెంగాల్ కు చెందిన రభిరాయ్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నారు. 

అతడి ద్వారా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్​ ద్వారా పదో తరగతి సర్టిఫికెట్ కు రూ.30 వేలు, ఇంటర్ కు రూ.40 వేలు, డిగ్రీ కి రూ.50 నుంచి 60 వేలు తీసుకుంటూ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఈ ముఠా సభ్యులు గత మూడేండ్ల నుంచి సుమారు వంద మందికి నకిలీ సర్టిఫికెట్లు అమ్మారు. 

నిందితులు రజిత, శ్రావణ్, మహేశ్, చంద్రయ్యను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.25వేల నగదు,395 నకిలీ సర్టిఫికెట్లు, ఐదు మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్, సీపీయూ, టూ వీలర్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చాకచక్యంగా వ్యవహరించి ముఠా సభ్యులను పట్టుకున్న డీఎస్పీ రఘుచందర్, సీసీఎస్ ఇన్​స్పెక్టర్​వెంకటేశ్వర్లు, ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్ కుమార్, సీసీఎస్ ఎస్సై నరేశ్, కానిస్టేబుల్స్ రమేశ్, వేణు, నవీన్ ను ఎస్పీ అభినందించారు.