విచ్చలవిడిగా నకిలీ కాస్మోటిక్స్‌‌ .. ప్రమాదకర కెమికల్స్‌‌తో తయారీ

విచ్చలవిడిగా  నకిలీ కాస్మోటిక్స్‌‌ .. ప్రమాదకర కెమికల్స్‌‌తో తయారీ
  • రకరకాల పేర్లతో మార్కెటింగ్
  • బ్రాండెడ్‌‌ కంపెనీల ప్యాకింగ్‌‌తోనకిలీ ప్రొడక్ట్‌‌ల అమ్మకాలు
  • అవి వాడితే చర్మ వ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ అందంగా కనిపించడానికి తహతహలాడుతున్నారు. ఇందుకోసం రకరకాల ఫేస్ క్రీములు, షాంపూలు, సబ్బులను జనాలు వినియోగిస్తున్నారు. దీంతో కాస్మోటిక్స్‌‌ వ్యాపారం వేల కోట్లకు విస్తరించింది. ఇదే అదునుగా కొంత మంది కేటుగాళ్లు రకరకాల రసాయనాలతో కల్తీ, నకిలీ కాస్మోటిక్స్‌‌ తయారు చేసి మార్కెట్‌‌లో విక్రయిస్తున్నారు. 

బ్రాండెడ్ కంపెనీల కవర్లలో ప్యాక్ చేసి వీటిని మార్కెట్‌‌‌‌లోకి వదులుతున్నారు. కొంత మంది బ్రాండెడ్ కంపెనీల పేర్లకు దగ్గరగా ఉండే పేర్లతో లేదా బ్రాండెడ్ కంపెనీల పేర్లలో ఏదో ఒక అక్షరం మార్చి ముద్రించిన ప్యాక్‌‌‌‌లలో పెట్టి విక్రయిస్తున్నారు. మన రాష్ట్రంలో నకిలీ కాస్మోటిక్స్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన డీసీఏ అధికారుల దాడుల్లో పెద్ద మొత్తంలో నకిలీ కాస్మోటిక్స్ బయటపడ్డాయి. వాటి తయారీ కూడా ఇక్కడే జరుగుతున్నట్టు గుర్తించి, ఉత్పత్తి కేంద్రాలను సీజ్ చేశారు. ఈ నకిలీ ఉత్పత్తులను వినియోగిస్తే చర్మ కేన్సర్ వంటివి వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్‌‌‌‌ చూసి కాస్మోటిక్స్ కొనుగోలు చేయొద్దని, ఏదైనా కొత్త వస్తువు వినియోగించే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌‌‌‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.

కల్తీ కోన్లు, క్రీములు

నకిలీ, నాసిరకం మెడిసిన్ దందాను అరికట్టేందుకు ఫార్మా కంపెనీలు, గోడౌన్లు, మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఇటీవల వరుసగా దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా నాలుగు రోజుల క్రితం మిర్యాలగూడలో ఓ మెడికల్ షాపులో డ్రగ్ ఇన్‌‌‌‌స్పెక్టర్లు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఫెయిర్ అండ్ బ్రైట్ పేరిట ఉన్న ఓ క్రీమ్‌‌‌‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రీమ్ పెట్టుకుంటే చర్మం రంగు మారుతుందని ప్రచారం చేస్తూ అమ్మకాలు చేపడుతున్నారని గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లోని ఓ కంపెనీలో ఈ క్రీమ్ తయారైనట్టు, ఢిల్లీకి చెందిన  కంపెనీ దీన్ని మార్కెటింగ్ చేస్తున్నట్టు క్రీమ్ ప్యాక్ మీద ముద్రించి ఉందని డీసీఏ తెలిపింది. డ్రగ్స్ రూల్స్‌‌‌‌లోని షెడ్యూల్ జే ప్రకారం ఇలా చర్మం రంగు మారుతుందని ప్రచారం చేస్తూ కాస్మోటిక్స్ అమ్మడం నేరం. ఆడపిల్లలు, మహిళలు అత్యధికంగా వినియోగించే కోన్‌‌‌‌ (మెహందీ, హెన్నా)లను కూడా కల్తీ చేస్తున్నట్టు డీసీఏ గుర్తించింది. ఆరోగ్యానికి అత్యంత హానికరమైన పిక్రామిక్ యాసిడ్‌‌‌‌తో కోన్‌‌‌‌ తయారు చేస్తున్నట్టు గుర్తించి, హైదరాబాద్‌‌‌‌ మెహిదీపట్నంలోని షకీల్ ఇండస్ట్రీస్‌‌‌‌ను అధికారులు జనవరి 9న సీజ్‌‌‌‌ చేశారు. ఇక్కడ తయారు చేస్తున్న నకిలీ కోన్‌‌‌‌ను ‘‘స్పెషల్ కరాచి మెహందీ కోన్‌‌‌‌’’ పేరిట, రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇవేకాదు కాస్మోటిక్ ఉత్పత్తుల తయారీలో వాడే రకరకాల రసాయనాలకు కూడా నకిలీలను తయారు చేస్తున్నారని డీసీఏ అధికారులు చెబుతున్నారు.

చర్మం కరాబైతది.. కేన్సర్ వచ్చే ప్రమాదం

ఫెయిర్ నెస్ క్రీమ్స్‌‌‌‌లో చాలా వరకు స్టెరాయిడ్స్ మిక్స్ చేస్తారు. వీటి ఎఫెక్ట్‌‌‌‌తో క్రీమ్ పెట్టగానే కొంత  చేంజెస్ కనిపిస్తాయి. కానీ, స్టెరాయిడ్స్ ఎఫెక్ట్‌‌‌‌తో స్కిన్ పలుచబడిపోతుంది. ర్యాషెస్ అవుతాయి. ఇలా అవుతుందని క్రీములు వాడడం మానేయగానే స్కిన్ కలర్ మారిపోతుంది. దీంతో అదే పనిగా వాడుతుంటారు. ఒక్కసారి స్కిన్ పలుచబడితే.. ఇక రివర్స్ అవ్వదు. ఫేస్‌‌‌‌లో రెడ్‌‌‌‌నెస్‌‌‌‌ పెరిగిపోతుంది. ఇచ్చింగ్‌‌‌‌, అలర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకుతాయి. మొహం మీద వెంట్రుకలు పెరుగుతాయి. అందుకే ఫెయిర్‌‌‌‌‌‌‌‌నెస్ క్రీములను ఇష్టారీతిన వాడొద్దని చెబుతాం. అసలు ఫెయిర్‌‌‌‌‌‌‌‌నెస్ క్రీములను వాడకపోవడం బెటర్‌‌‌‌‌‌‌‌. ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ సలహా మేరకు వారు చెప్పిన మెడిసిన్ వినియోగించాలి. అవి కూడా చర్మానికి పడుతున్నయో, లేవో ప్రారంభంలో తెలిసిపోతుంది. ఇక నకిలీ, నాసిరకం క్రీముల వాడితే రకరకాల అలర్జీలు, ర్యాషెస్ వస్తాయి. కొన్నిసార్లు ఇవి సివియర్‌‌‌‌‌‌‌‌గా ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలంలో రకరకాల చర్మ వ్యాధులు వస్తాయి. ప్రమాదకర కెమికల్స్ కలిపిన క్రీములు వాడడం వల్ల, కొద్ది మందిలో చర్మ కేన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.డాక్టర్ కార్తీక్ సుంకి, డెర్మటాలజిస్ట్‌‌‌‌, సౌమ్య స్కిన్ క్లినిక్, మన్సూరాబాద్‌‌‌‌, హైదరాబాద్