కర్ణాటకలో కలర్ ప్రింటింగ్‌‌‌‌ చేసి సిటీలో సప్లయ్

కర్ణాటకలో కలర్ ప్రింటింగ్‌‌‌‌ చేసి సిటీలో సప్లయ్
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: ఫేక్ కరెన్సీని చలామణి చేస్తున్న గ్యాంగ్​కు చెందిన ఇద్దరిని సౌత్‌‌‌‌జోన్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హుస్లూర్ కు చెందిన శేఖర్ అక్కడే జిరాక్స్ షాప్ నడుపుతున్నాడు. ఈజీ మనీ కోసం ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసేందుకు స్కెచ్ వేశాడు. కలర్ జిరాక్స్, ఇతర ప్రింటింగ్ మెటీరియల్​తో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేశాడు. వాటిని సర్క్యులేట్ చేసేందుకు మహారాష్ట్రలోని లాతూర్​కు చెందిన సయ్యద్ అన్సారీ (27)తో కలిసి హైదరాబాద్​లో నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో భాగంగా సయ్యద్ అన్సారీ పాతబస్తీలోని మీర్ చౌక్​లో కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు.

శేఖర్ ప్రింట్ చేసిన  ఫేక్ కరెన్సీని అన్సారీ ఫలక్ నుమాలోని వట్టేపల్లికి చెందిన షేక్ ఇమ్రాన్(33)కు సప్లయ్ చేసేవాడు. ఇలా  అన్సారీ, ఇమ్రాన్ పాతబస్తీలోని కూరగాయల మార్కెట్ల దగ్గర, చిరు వ్యాపారులకు దొంగ నోట్లను ఇచ్చేవారు. ఈ దందా గురించి సమాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రాఘవేంద్ర టీమ్ వీరిపై నిఘా పెట్టింది. దొంగ నోట్లతో తిరుగుతున్న అన్సారీ, ఇమ్రాన్​ను గురువారం ఎంజీబీఎస్ వద్ద అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2 లక్షల 50 వేల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. పరారీలో ఉన్న శేఖర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.