
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో ఆదివారం పిల్లలు ఆడుకునే నోట్ల కట్టలు రోడ్డుపై కనిపించడం కలకలం రేపింది. మధ్యాహ్నం 12 గంటల టైంలో గుడిపేట బృందావన్ కాలనీ సమీపంలో కారులో లక్షెట్టిపేట వైపు నుంచి ముగ్గురు వ్యక్తులు రాగా, మరొకరు బైక్ పై వచ్చారు. వీరి మధ్య వాగ్వాదం జరగగా, అక్కడ పిల్లలు ఆడుకునే 9 ప్లేయింగ్ కరెన్సీ నోట్ల కట్టలు వదిలేశారు.
అనంతరం ఇద్దరు వ్యక్తులు లక్షెట్టిపేట వైపు, మరో ఇద్దరు మంచిర్యాల వైపు వెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్సై స్వరూప్ రాజ్ ఘటనా స్థలానికి చేరుకుని ప్లేయింగ్ కరెన్సీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.