జాతరలే అడ్డాగా ఫేక్​ కరెన్సీ దందా

జాతరలే అడ్డాగా ఫేక్​ కరెన్సీ దందా
  •  పోలీసులకు దొరక్కుండా ప్లాన్లు
  •  యూట్యూబ్‍లో  వీడియోలు  
  •  ముఠాలో నలుగురు అరెస్ట్

వరంగల్‍, వెలుగు : జాతరలే అడ్డాగా ఫేక్‍ కరెన్సీతో పాటు శక్తులున్న కలశం, రాగి కాయిన్స్​ అంటూ మోసాలు చేస్తున్న  ముఠాను బుధవారం వరంగల్‍ పోలీసులు అరెస్ట్ ​చేశారు. వివరాలను వరంగల్‍ సీపీ డాక్టర్‍ తరుణ్‍జోషి, డీసీపీ వైభవ్ గైక్వాడ్‍, సీఐ శ్రీనివాస్‍ జీ, సంతోష్‍ తెలిపారు. వనపర్తి జిల్లాకు చెందిన ముమ్మడి ధనుంజయ్‍, రంగారెడ్డి జిల్లాకు చెందిన గుట్టా హరిప్రసాద్‍రెడ్డి, వరంగల్‍ జిల్లా ఇల్లందుకు చెందిన గడ్డం నాగరాజు, వరంగల్‍ జిల్లా గొర్రెకుంటకు చెందిన  చల్లా మహేశ్‍, వర్ధన్నపేటకు చెందిన రాజు,  హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన అశోక్‍, కామారెడ్డి జిల్లాకు చెందిన కిషన్‍, మహబూబాబాద్​ జిల్లాకు చెందిన సతీశ్​ ఫేక్​ కరెన్సీ, మహిమ ఉన్న వస్తువులంటూ జనాలను చీట్ ​చేయాలని ప్లాన్​ వేశారు. వీరు మెయిన్​గా ఫేక్​ కరెన్సీ దందా చేసేవారు. పోలీసులు రైడ్​ చేస్తే దొంగనోట్లను గుర్తించకుండా సోడియం సల్ఫైట్‍లో ముంచి నల్లని పేపర్లుగా మారుస్తూ తప్పించుకునేవారు. వీరితో కలిసి బిజినెస్​ చేయడానికి వచ్చే వారిని కూడా బోల్తా కొట్టిస్తున్నారు. తామిచ్చే దొంగ నోట్లు బ్లాక్​గా ఉంటాయని, కెమికల్‍లో ముంచితీస్తే అసలు నోటు బయటపడుతుందని చెప్పేవారు. ఫేక్ ​కరెన్సీపైన మసి పూసిన ఒరిజినల్ ​నోట్లు పెట్టి టెస్ట్ ​చేసి చూపించేవారు. సోడియం సల్ఫైట్‍ బాటిల్‍ కూడా ఇచ్చేవారు. ఇది నమ్మినవారు తీసుకెళ్లి ముంచితే నోట్లన్నీ చిరిగిపోయేవి. ఇలా ఇప్పటివరకు ఈ ముఠా ఎంతోమందిని చీట్ ​చేసింది. 
శక్తులున్నాయంటూ ... 
తమ వద్ద వందల ఏండ్ల కిందివి, శక్తులున్న కలశాలు, రాగి కాయిన్స్​, జగ్గులు ఉన్నాయంటూ య్యూట్యూబ్​లో వీడియోలు పెట్టారు. బయట రాగి పాత్రలు కొని కెమికల్స్​లో పూసే వారు. కొనాలనుకునేవారితో వాటిమీద బియ్యం. నిమ్మకాయలు పెట్టమని చెప్పేవారు. కెమికల్‍ ఎఫెక్ట్​తో క్షణాల్లో అవి నల్లగా మారిపోయేవి. చిన్న బ్యాటరీలు అమర్చి కదిలేలా చేసేవారు. దీంతో నమ్మిన వారు లక్షలు ఇచ్చి వీటిని కొనేవారు.   
 జాతరలో భక్తులే లక్ష్యం 
నకిలీ కరెన్సీని స్ప్రెడ్​ చేయడానికి  ఈ ముఠా జాతరలను టార్గెట్​గా చేసుకుంది. గత నెల నుంచి జాతరలు నడుస్తుండడంతో లక్షల ఫేక్‍ కరెన్సీని జనాల్లోకి వదిలారు. ఇప్పుడు మేడారం జాతరను టార్గెట్​ చేసుకుని ఇప్పటికే లక్షల్లో నకిలీ కరెన్సీని మార్చారు. ఇంకా మార్చడానికి నిందితులైన ధనుంజయ్‍, హరిప్రసాద్‍రెడ్డి, మహేశ్‍ వర్ధన్నపేటలోని ఇద్దరికి నోట్లు ఇచ్చేందుకు వెళ్లారు. తెలుసుకున్న టాస్క్​ఫోర్స్,  వర్ధన్నపేట పోలీసులు  వలపన్ని పట్టుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. రూ.26 లక్షల 80 వేల నకిలీ నోట్లు, రెండు రాగి కలశాలు, రాగి జగ్గు, బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు.