లింకు డాక్యుమెంట్లు లేకున్నా దర్జాగా దందా 

లింకు డాక్యుమెంట్లు లేకున్నా దర్జాగా దందా 

ఖమ్మం/ వైరా, వెలుగు:  వైరా మున్సిపాలిటీలో ఫేక్ డాక్యుమెంట్ల దందా కొనసాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు, ప్లాట్ రిజిస్ట్రేషన్  కావాలంటే అవసరమైన బ్లూ ప్రింట్, బిల్డింగ్​ పర్మిషన్​ పత్రాలను పాత డేట్ లతో క్రియేట్ చేస్తున్నారు. కొందరు మున్సిపల్​ సిబ్బంది రూ.30 వేలు తీసుకొని నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తుండగా, వారికి రిజిస్ట్రేషన్​ ఆఫీసు సిబ్బంది మామూళ్లు తీసుకొని సహకరిస్తున్నారు. డాక్యుమెంట్  రైటర్లు ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ దందాలో దళారులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మున్సిపల్ ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు విషయం తెలిసినా చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో వారి ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. 

ఫైళ్లు మాయం చేసిన్రు..

గతంలో వైరా మేజర్ గ్రామ పంచాయతీగా ఉండగా, కొన్ని గ్రామాలను విలీనం చేసి 2018 లో మున్సిపాలిటీగా మార్చారు. ఈ సమ యంలో గండగలపాడు, సోమవరం, వైరా మేజ ర్ పంచాయతీకి చెందిన రికార్డులన్నింటినీ కొందరు సిబ్బంది మాయం చేశారు. అప్పట్లో జరిగిన ఆడిటింగ్ లో రూ.3.50 కోట్ల అవినీతి జరిగిందని తేలడంతో, ఆధారాలు దొరక్కుండా రికార్డులను కాల్చేశారని ఎంక్వైరీలో తేలింది. దీనికి బాధ్యులైన ఇద్దరు బిల్ కలెక్టర్లను అప్పట్లో సర్వీస్  నుంచి తొలగించారు. దీనిని అవకాశంగా చేసుకున్న కొందరు మున్సిపల్ సిబ్బంది ఈ దందాకు తెరలేపారు. మేజర్ గ్రామ పంచాయతీ ఈవో కిశోర్,  యూడీసీ సైదులు మంజూరు చేసినట్లుగా పాత తేదీల్లో ఫోర్జరీ సంతకాలు, నకిలీ స్టాంపులతో సర్టిఫికెట్లు అమ్మేస్తున్నారు. వీటి ఆధారంగా ప్లాట్లు, ప్రభుత్వ స్థలాలు, ఇతరుల భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.

దీంతో యజమానులకు, ఫేక్ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వారికి గొడవలు జరుగుతున్నాయి. 
పోలీసులకు సబ్​ రిజిస్ట్రార్​ కంప్లైంట్ ఇటీవల వైరాకు చెందిన సీపీఎం నేతలు రిజిస్ట్రేషన్లపై సబ్ రిజిస్ట్రార్ కు కంప్లైంట్ చేశారు. దీంతో వారం రోజుల నుంచి వైరా మున్సిపాలిటీ పరిధిలో లింక్ డాక్యుమెంట్లు లేకుండా, ఇతర ధృవపత్రాల ఆధారంగా జరిగే రిజిస్ట్రేషన్లను నిలిపేశారు. ఫేక్ డాక్యుమెంట్ల వ్యవహారంపై దర్యాప్తు చేయాలని పోలీసులకు సబ్ రిజిస్ట్రార్  ఫిర్యాదుచేశారు. పోలీసుల ఎంక్వైరీ తర్వాత ఉన్నతాధికారులకు పరిస్థితి వివరించి రిజిస్ట్రేషన్లపై నిర్ణయం తీసుకుంటామని సబ్ రిజిస్ట్రార్ చెబుతున్నారు. 

వైరా మున్సిపల్ ఆఫీస్ వెనుక సర్వే నెంబర్ 98లో దాదాపు అరెకరం ప్రభుత్వ గుట్ట ఉంది. మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉండడంతో ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.4 కోట్లకు పైగా రేటు ఉంటుంది. దీంతో సమీపంలో ఇండ్ల స్థలాలున్న వారి కన్ను ఈ గుట్టపై పడింది. తమకు వారసత్వంగా వచ్చిన భూమి అంటూ రిజిస్ట్రేషన్ చేయించుకుంటు న్నారు. గతంలో ఉన్న రిజిస్టర్డ్  డాక్యుమెంట్ లో 270 గజాలు ఉన్న ఒక అధికార పార్టీ చోటా నాయకుడు, ఆ నెంబర్ ను 720 గజాలుగా మార్చి మూడు నెలల క్రితం రిజిస్ట్రేషన్  చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికి మున్సిపల్, సబ్ రిజిస్ట్రార్  ఆఫీస్ లోని కొందరు సిబ్బంది తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చి సహకరించారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై తాజాగా గ్రీవెన్స్ లో కొందరు సీపీఎం నేతలు కలెక్టర్ వీపీ గౌతమ్ కు ఫిర్యాదు చేశారు.