ఓట్ల కోసం ఫేక్ ప్రచారం .. పూటకో తప్పుడు వార్త

ఓట్ల కోసం ఫేక్ ప్రచారం .. పూటకో తప్పుడు వార్త

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫేక్ కంటెంట్​ ప్రచారం పెరిగిపోతున్నది. ఫేక్ లెటర్లు, ఫేక్ పేపర్ క్లిప్పింగ్స్​ను క్రియేట్ చేస్తూ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ప్రత్యర్థి ఇమేజ్​ను డ్యామేజ్​ చేయడం, తమకు అనుకూలంగా ఓటర్లను మలుచుకోవడమే టార్గెట్​గా ఫేక్​ కంటెంట్​ను సృష్టిస్తున్నారు. ఈ లెటర్లు, క్లిప్పింగ్స్​ వాస్తవమేనన్నట్లుగా ఆయా పార్టీల లీడర్లు కూడా తమ ప్రసంగాల్లో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఒరిజినలో.. ఏది ఫేకో తెలియక సామాన్యులు వాటిని తమ ఫ్రెండ్స్​కు, సన్నిహితులకు షేర్​ చేస్తున్నారు. వాట్సాప్​లో స్టేటస్​లుగా, ఫేస్​బుక్​లో పోస్టులుగా పెట్టుకుంటున్నారు. అసలు వాస్తవం బయటకు వచ్చే సరికి ప్రత్యర్థికి జరగాల్సినంత నష్టం జరిగిపోతున్నది. 


ఫేక్​ కంటెంట్​ను క్రియేట్​ చేయడానికి, వైరల్​ చేయడానికి కొందరు లీడర్లు ప్రత్యేకంగా సోషల్​ మీడియా టీమ్​లను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. క్షణాలు, నిమిషాల్లో ఎక్కువ మందికి ఫేక్​ రీచ్​ అయ్యేలా ఆ టీమ్​లు పనిచేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్​ రిలీజ్​ అయినప్పటి నుంచి ఫేక్ కంటెంట్​ ప్రచారం షురూ అయింది. కొన్ని పార్టీలు తమ అభ్యర్థుల లిస్టులను ప్రకటించకముందే.. వీరే ఆయా పార్టీల అభ్యర్థులు అంటూ పేర్లతో పాటు ప్రత్యర్థులు సోషల్​ మీడియాలో వైరల్​ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ లోపు రైతు బంధు నగదును చెల్లించాలని ఈసీకి కాంగ్రెస్​ పార్టీ లేఖ రాయగా.. పూర్తిగా రైతుబంధు స్కీమ్ ను ఆపాలన్నట్లుగా, ఆ స్కీమ్​ వల్ల డబ్బులు వృథా అవుతున్నాయన్నట్లుగా అధికార పార్టీ నేతలు తమ ఎన్నికల సభల్లో ప్రచారం చేయడం, ఇదే అంశంపై ఆ పార్టీ ఫాలోవర్స్​ సోషల్​ మీడియాలో మీమ్స్, కామెంట్స్​ వైరల్​ చేయడం చర్చనీయాంశమైంది. దీన్ని కాంగ్రెస్​ నేతలు ఖండించారు. ఈసీకి తాము రాసిన లేఖ ఏమిటో  సరిగ్గా చూడాలని హితవుపలికారు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  

బాబు, రేవంత్​ కలువకపోయినా.. కలిసినట్లుగా..!

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కాంగ్రెస్ కు ఓటు వేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాసినట్లుగా మొన్నామధ్య ఒక ఫేక్ లెటర్  బయటకు వచ్చింది. రెండు రోజుల కింద.. బీఆర్ ఎస్ కు ఓటు వేయాలని చంద్రబాబు లేఖ రాసినట్లుగా మరో ఫేక్​ లేఖ బయటకు వచ్చింది. ఇక బెయిల్ నుంచి విడుదలై ట్రీట్ మెంట్ కు వచ్చిన చంద్రబాబును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అర్ధరాత్రి వెళ్లి సీక్రెట్​గా కలిశారని ఓ పేపర్​ లోగోతో ఫేక్​ న్యూస్​ను కొందరు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు. ఇది తప్పుడు వార్త అని, తమ పత్రికలో ప్రచురితం కాలేదని సదరు పత్రిక వివరణ ఇచ్చింది. 

ఆలయ భూముల అమ్మకంపై తప్పుడు బ్రేకింగ్​

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ముస్లిం డిక్లరేషన్ అమలుకు ఆలయ భూములు అమ్ముతామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఓ టీవీ చానల్​లోగోతో కొందరు ఫేక్​ బ్రేకింగ్ న్యూస్​క్లిప్​ను క్రియేట్​ చేసి  సోషల్ మీడియాలో  వైరల్​ చేశారు. దీన్ని పట్టుకొని రేవంత్ పై ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు రేవంత్​ చేయలేదని, కావాలంటే ముస్లిం డిక్లరేషన్ విడుదల టైమ్ లో ఆయన మాట్లాడిన వీడియో మొత్తం వినండని కాంగ్రెస్  సూచించింది. 

ఫ్యాక్ట్ చెక్​ పెడ్తున్నా అంతగా రీచ్​ అయితలే..

సాధారణ రోజుల్లో కంటే ఎలక్షన్ టైమ్ లో ఫేక్ వీడియోలు, ఫేక్  ప్రెస్ నోట్ లు, ఫేక్​ ఫొటోలు పెద్ద ఎత్తున క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని కట్టడి చేయటం సైబర్ క్రైమ్ పోలీసులకు తలకు మించిన భారంగా మారుతున్నది. నిత్యం ఇవే ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు చెప్తున్నారు. ప్రత్యర్థులు చేస్తున్న ఫేక్​ ప్రచారం గెలుపోటములపై ప్రభావం చూపుతాయని అభ్యర్థులు కలవరపడుతున్నారు. వీటిని ఖండిస్తున్నట్లు వివరణ ఇస్తున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పదవుల్లో ఉన్న వారు కూడా కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా ఇలాంటి ఫేక్​ కంటెంట్​ను  సర్క్యులేట్ చేస్తుండటం, వాటిని తమ స్పీచ్ ల్లో కూడా ప్రస్తావిస్తుండటం గమనార్హం. పలువురు నెటిజన్స్​ఫ్యాక్ట్ చెక్​ పేరుతో ‘ఏది ఫేక్​, ఏది ఒరిజినల్’​ అనేది సోషల్​ మీడియాలో పెడ్తున్నా.. అవి ఫేక్​ కంటెంట్​ అంత వేగంగా జనంలోకి వెళ్లడం లేదు.   

ఫాక్స్​కాన్​పై డీకే పేరిట ఫేక్​ లెటర్​

ఫాక్స్​కాన్ కంపెనీని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆ కంపెనీ చైర్మన్​కు లేఖ రాసినట్లు ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫేక్​ లెటర్​ వైరల్​ అయింది. బీఆర్​ఎస్​ పార్టీ మీటింగ్​లో మంత్రి కేటీఆర్ కూడా డీకే శివకుమార్​ లెటర్ రాశారని చెప్పడంతో అందరూ నిజమని భావించారు. అధికార పార్టీ నేతలు కాంగ్రెస్​పై, డీకేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ.. తాను ఎవరికీ లేఖ రాయలేదని స్పష్టం చేశారు. బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయడంతో.. ఆ లెటర్​ ఫేక్​ అని తేలింది.