దొంగ నోట్ల తయారీ గ్యాంగ్ .. నల్ల పేపర్లు అంటగడుతున్న ముఠా అరెస్ట్‌‌‌‌

దొంగ నోట్ల తయారీ గ్యాంగ్ .. నల్ల పేపర్లు అంటగడుతున్న ముఠా అరెస్ట్‌‌‌‌
  • అసలుకు మూడింతలు నకిలీ నోట్లు అంటూ మోసం
  • ఒక వంతు ఒరిజినల్‌‌‌‌ నోట్లకు మూడింతల నకిలీ నోట్లు 
  • జీరాక్స్‌‌‌‌ పేపర్లను అయోడిన్‌‌‌‌ టంక్చర్‌‌‌‌లో ముంచి నల్లగా మారుస్తున్న వైనం
  • హైపోలో ముంచిన తర్వాత నోట్లుగా మారుతాయంటూ నమ్మిస్తున్న ముఠా
  • ఎనిమిది మందిని అరెస్ట్‌‌‌‌ చేసిన వరంగల్‍ పోలీసులు

వరంగల్‍, వెలుగు : ఒక వంతు అసలు కరెన్సీ నోట్లకు మూడింతల నకిలీ నోట్లు ఇస్తామంటూ.. జీరాక్స్‌‌‌‌ పేపర్లు అంటగడుతున్న ఎనిమిది మందిని వరంగల్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌, నర్సంపేట పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్‍ ఈస్ట్‌‌‌‌ జోన్‌‌‌‌ డీసీపీ అంకిత్‌‌‌‌కుమార్‌‌‌‌ సోమవారం కమిషనరేట్‌‌‌‌లో వెల్లడించారు. 

వరంగల్‌‌‌‌ జిల్లా నర్సంపేటకు చెందిన శాగంటి కిరణ్‍, నీరటి శివ, నీరటి రంజిత్‍, గుడికందుల రవి, ములుగు జిల్లా ఘన్‌‌‌‌పూర్‌‌‌‌కు చెందిన పోరిక రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌, ఖమ్మం జిల్లా వేంసూర్‍కు చెందిన తనమాల రాజశేఖర్‍, భువనగిరి జిల్లా తాతానగర్‍కు చెందిన ముదురుకోల ఏకాంబ్రం, కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలానికి చెందిన చేను సాయికిరణ్‌‌‌‌ ముఠాగా ఏర్పడ్డారు. 

వీరు ఒక వంతు అసలు కరెన్సీ నోట్లకు మూడింతలు నకిలీ కరెన్సీ ఇచ్చేలా నకిలీ నోట్లు చలామణి చేసే వారితో ఒప్పందం చేసుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు చిక్కకుండా సరికొత్త టెక్నాలజీతో నోట్లను నల్లగా మార్చి ఇస్తామని వారిని నమ్మిస్తున్నారు. తర్వాత అసలు నోట్లను కలర్‌‌‌‌ ప్రింట్‌‌‌‌ తీసి వాటిని‘అయోడిన్‌‌‌‌ టంక్చర్‍’ ద్రావణంలో ముంచి నల్లగా మారుస్తున్నారు. 

నోట్లు తీసుకునే వ్యక్తులు వచ్చిన తర్వాత.. తమ వద్ద ఉన్న అసలు నోట్లను అయోడిన్‌‌‌‌ టంక్చర్‌‌‌‌లో ముంచి నల్లగా మారిన తర్వాత.. ‘హైపో’ (సోడియం థయోసల్ఫేట్‍)లో ముంచుతున్నారు. దీంతో అవి తిరిగి అసలు నోట్లుగా కనిపిస్తున్నాయి. ఇలాగే మిగతా కరెన్సీ మొత్తం నల్లటి రంగులో ఉంటుందని, తాము అనుకున్న చోటుకు వెళ్లాక ఆ నోట్లను హైపోలో ముంచి కరెన్సీగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. నిజమేనని నమ్మిన వ్యక్తులు ఆ నోట్లు తీసుకెళ్తారు. తర్వాత హైపోలో ముంచిన తర్వాత అవి జీరాక్స్‌‌‌‌ తీసిన నోట్లుగా కనిపిండడంతో నోట్లు చలామణి చేసే వారు మోసపోతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ క్రమంలో వరంగల్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌, నర్సంపేట పోలీసులు మొత్తం ఎనిమిది మందిని పట్టుకున్నారు. 

ఈ నిందితుల ముఠా గతంలో ములుగు ఘన్‌‌‌‌పూర్‌‌‌‌, సికింద్రాబాద్‍ మోండా మార్కెట్‍, వేంసూర్‍ కొత్తగూడెం, హైదరాబాద్‌‌‌‌ ఛత్రినాక, నర్సంపేట ప్రాంతాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి రూ. 1.48 లక్షల ఒరిజినల్‌‌‌‌ నోట్లతో పాటు నల్లటి జీరాక్స్‌‌‌‌ పేపర్లు, రూ.28 లక్షల విలువైన ల్యాప్‍టాప్‍లు, ప్రింటర్లు, 13 సెల్‍ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ ఏసీపీ మధుసూదన్‍, నర్సంపేట ఏసీపీ రవీందర్‍రెడ్డి, టాస్క్‌‌‌‌ఫోన్స్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ బాబులాల్‍, నర్సంపేట ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ శ్రీనివాస్‍, ఏఏఓ సల్మాన్‍, సిబ్బందిని వరంగల్‍ సీపీ సన్‍ప్రీత్‍సింగ్‌‌‌‌ అభినందించారు.