
- 23 నకిలీ పాస్ పుస్తకాలు స్వాధీనం
కురవి, వెలుగు : నకిలీ పాస్‌బుక్స్ తయారు చేస్తూ, వాటి ఆధారంగా రైతులకు లోన్లు ఇప్పిస్తున్న ముఠాను మహబూబాబాద్ జిల్లా కురవి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం కురవి పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు వెల్లడించారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారు మంచ్యాతండాకు చెందిన బాలాజీ, మహబూబాబాద్ మండలం అమనగల్లు శివారు కౌంసలితండాకు చెందిన బానోతు హరికిషన్, జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఓబులాపురం తండాకు చెందిన బానోతు వర్జన్ కలిసి కురవితో పాటు చుట్టుపక్కల మండలాల రైతులను బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో లోన్ ఇప్పిస్తామంటూ చెప్పి వారి నుంచి వివరాలు సేకరించారు.
అనంతరం ఒక్కో పాస్‌బుక్‌కు రూ. 10 వేల చొప్పున వసూలు చేసి, నకిలీ పాస్‌బుక్స్ తయారు చేశారు. వాటి ద్వారా కురవి యూనియన్ బ్యాంకులో ఒకరికి, డోర్నకల్ యూనియన్ బ్యాంక్‌లో ఆరుగురికి, మహబూబాబాద్ యూనియన్ బ్యాంకులో ఒకరికి, మహబూబాబాద్ కెనరా బ్యాంకులో ముగ్గురికి మొత్తం రూ. 16.90 లక్షల లోన్ ఇప్పించారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పాకి పోలీసులకు చేరడంతో విచారణ ప్రారంభించారు.
బాలాజీ, హరికిషన్, వర్జన్ శుక్రవారం కురవికి వచ్చినట్లు తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పాస్‌బుక్స్ తయారీ కేసులో విచారణ కొనసాగుతోందని, ఎవరెవరికి లోన్లు ఇప్పించారో తెలుసుకొని అందరినీ అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు.
నిందితుల వద్ద నుంచి 23 నకిలీ పాస్‌బుక్స్, ల్యాప్‌ట్యాప్, ప్రింటర్, కంప్యూటర్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కురవి ఎస్సై సతీశ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు.