నకిలీ పురుగుల మందు అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్

నకిలీ పురుగుల మందు అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు : రైతులను మోసంచేసి నకిలీ పురుగుల మందు విక్రయిస్తున్న ముఠా గుట్టును బాలానగర్​ ఎస్ఓటీ, జీడిమెట్ల పోలీసులు రట్టుచేశారు. రూ.20 లక్షల విలువైన 1,160 లీటర్ల పురుగుల మందును స్వాధీనంచేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులను​ రిమాండ్​కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాలానగర్​ డీసీపీ శ్రీనివాసరావు మంగళవారం మీడియాకు వివరించారు. హైదరాబాద్ లోని వనస్థలిపురానికి చెందిన బిల్లిపల్లి నరేందర్​ రెడ్డి (35)  అగారియా క్రాప్స్​ సైన్సెస్​  పేరుతో బయో పెస్టిసైడ్స్​ బిజినెస్ ​చేస్తున్నాడు.

 ఏపీలోని గుంటూరు జిల్లా చెరుకుపల్లి, గూడవెల్లికి చెందిన దాసరి వెంకటేశ్వరావు (52)  పురుగుల మందు డిస్ట్రిబ్యూటర్​గా పనిచేస్తున్నాడు. నరేందర్​రెడ్డికి పురుగుల మందులపై మంచి అవగాహన ఉంది. రాష్ట్ర  ప్రభుత్వం నిషేధించిన మెనోక్రోటోపాస్, గ్లైపోసేట్​కు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉందని అతను గుర్తించాడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి వాటిని విక్రయించాలని ప్లాన్  చేశాడు. అతనికి బయోపెస్టిసైడ్స్​ తయారీ అనుమతులు ఉండగా ఎలాంటి అనుమతులు లేకుండా కెమికల్​ పెస్టిసైడ్స్​ అమ్మాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా నరేందర్​ రెడ్డి  గుజరాత్​ నుంచి నకిలీ పురుగుల మందులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేశాడు. అనంతరం వాటిని చిన్నగా కంటెయినర్స్​లోప్యాక్​ చేసి వివిధ రకాల నకిలీ కంపెనీల లేబుల్స్​  అతికించి వెంకటేశ్వరావు సహయంతో రైతులకు అమ్మాడు. 

కాగా, మంగళవారం సాయంత్రం  నరేందర్​ రెడ్డి, వెంకటేశ్వరావు  మరో వ్యక్తి కురకుల రాజు (26) డ్రైవర్​తో కలిసి నకిలీ పురుగుల మందులను ఓ మినీ ట్రక్​లో నింపారు. వాటిని అబ్దుల్లాపూర్​మెట్​ నుంచి నర్సాపూర్​ ఏరియాలో రైతులకు అమ్మడానికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్​ ఎస్ఓటీ, జీడిమెట్ల పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. నిందితుల నుంచి రూ.20 లక్షల విలువైన నకిలీ పురుగుల మందు బాటిల్స్, వెహికల్, మూడు మెబైల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని అరెస్టు​చేసి రిమాండ్​కు తరలించారు. కాగా, ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే  ​ డయల్​100కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.