రాష్ట్రంలో రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాలు

రాష్ట్రంలో రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాలు
  • పత్తి, సోయా, మిర్చి, కంది అన్నింట్లో నకిలీలే..
  • సబ్సిడీ సీడ్​ సప్లయ్ కి సర్కారు మంగళం 
  • కలెక్షన్​ టూర్లుగా మారిన టాస్క్​ఫోర్స్​ తనిఖీలు

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో నకిలీ సీడ్​తో రైతులు నట్టేట మునుగుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీ సీడ్ సప్లయ్​కి మంగళం పాడడంతో మార్కెట్​లో దొరికే నాసిరకం విత్తనాలతో నష్టపోతున్నారు. సర్కారు రాష్ట్రాన్ని సీడ్ ​బౌల్ ఆఫ్​ఇండియాగా మార్చడం మాట అటుంచితే కనీసం నకిలీ సీడ్​ను కూడా కంట్రోల్​ చేయలేకపోతోంది. పత్తి, వరి, సోయా, కంది, మిర్చి తదితర పంటలన్నింటిదీ ఇదే పరిస్థితి. ఒక అంచనా ప్రకారం రాష్ర్టవ్యాప్తంగా ఏటా రూ.వెయ్యి కోట్లకు పైగా నకిలీ సీడ్​బిజినెస్ ​సాగుతోన్నట్టు సమాచారం. కఠినమైన చట్టాలను తీసుకురాకపోవడం, ఉన్న చట్టాలను అమలు చేయకపోవడం రైతుల పాలిట శాపమవుతోంది. సీజన్ ​ప్రారంభంలో టాస్క్​ఫోర్స్ ​కమిటీల తనిఖీలు ‘కలెక్షన్​ టూర్లు’ గా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

నకిలీ సీడ్​తో పత్తి రైతుల విలవిల 

రాష్ట్రంలో కోటిన్నర ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వివిధ పంటలు సాగవుతుంటే.. 70 నుంచి 75 లక్షల ఎకరాల్లో పత్తి వేస్తున్నారు. ఎకరానికి రెండున్నర ప్యాకెట్ల చొప్పున1.80 లక్షల ప్యాకెట్లు సీడ్ ​అవసరం ఉంటుంది. రైతులకు నాణ్యమైన బీటీ పత్తి విత్తనాలు అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ ​కాగా, వివిధ కంపెనీలు కూడా డిమాండ్​కు సరిపడా సప్లయ్ ​చేయలేకపోతున్నాయి. పైగా బీటీ పత్తిని విపరీతంగా చీడపీడలు ఆశించడంతో రైతులు నష్టపోతున్నారు. ఇదే అదునుగా పలు కంపెనీలు హెచ్​టీ, గ్లైసిల్ ​పేరిట సర్కారు ​పర్మిషన్ ​లేని సీడ్​ను మార్కెట్​లోకి తీసుకువచ్చాయి. గ్లైపోసెట్​అనే గడ్డి మందు కొట్టి పత్తిలో కలుపును సులువుగా నివారించవచ్చని ప్రచారం చేశాయి. దీంతో రైతులు గ్లైసిల్​ సీడ్ సాగుకు మొగ్గు చూపుతున్నారు. వివిధ కంపెనీల బీటీ సీడ్​400 గ్రాముల ప్యాకెట్ ధర రూ.750 నుంచి రూ.800 వరకు ఉండగా, గ్లైసిల్​ కిలో రూ.2వేల నుంచి రూ.2500 వరకు దొరుకుతోంది. వ్యాపారులు ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక నుంచి సీజన్​కు ముందే గ్లైసిల్ సీడ్​ను తెచ్చి గ్రామాల్లోని ఏజెంట్ల ద్వారా రైతులకు అంటగడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ దందా సాగుతోంది. మరికొందరు వ్యాపారులు గడువు ముగిసిన ప్యాకెట్ల లేబుళ్లు మార్చి అమ్ముతున్నారు. ఈ విత్తనాలు మొలకెత్తకపోవడం, ఆశించిన దిగుబడి రాకపోవడంతో రైతులు పెట్టుబడులతో సహా నష్టపోతున్నారు.   

కంట్రోల్​ చేయని సర్కారు

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు అమల్లోకి వచ్చినప్పటి నుంచి సబ్సిడీ సీడ్​ సప్లయ్​కి మంగళం పాడింది. నకిలీ సీడ్​ దందా యథేచ్ఛగా సాగుతున్నా కంట్రోల్​ చేయడం తన పని కాదన్నట్టు వ్యవహరిస్తోంది. నకిలీ సీడ్​ను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తీసుకొస్తామని సీఎం కేసీఆర్​పలుమార్లు ప్రకటించడం తప్ప చేసిందేమీ లేదు. 2015లో అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్ డ్రాఫ్ట్​ను రెడీ చేయగా సీడ్​ కంపెనీల లాబీయింగ్ కారణంగా అది బుట్టదాఖలైంది. కొన్ని జిల్లాల్లో నకిలీ సీడ్​ విక్రేతలపై పీడీ యాక్ట్​ పెడుతున్నా చట్టంలోని లొసుగులను వాడుకొని ఈజీగా బయటపడుతున్నారు. ఎన్విరాన్​మెంటల్ ప్రొటెక్షన్ ​యాక్ట్​ కింద ఏడేండ్ల వరకు జైలు శిక్ష విధించే ఛాన్సున్నా, నకిలీ విత్తన వ్యాపారులకు లీడర్ల అండదండలుండడంతో ఈ చట్టాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారు. ఏటా ఖరీఫ్​ సీజన్ ​ప్రారంభంలో  సీడ్స్, ఫర్టిలైజర్​షాపుల్లో తనిఖీలకు అగ్రికల్చర్, పోలీస్​అధికారులతో టాస్క్​ఫోర్స్ టీంలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఈ టీంలు పలు జిల్లాల్లో తనిఖీల పేరిట హడావుడి చేసినప్పటికీ పెద్దగా కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం.  

ఎవరికీ చెప్పుకోలేక...

బెల్లంపల్లి నియోకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన రైతులు నిరుడు జూన్​ రెండో వారంలో పత్తి విత్తనాలు నాటారు. విత్తనం నాటిన వారం రోజుల్లో మొలకలు రావాల్సి ఉండగా, ఇరవై రోజులైనా పది శాతం కూడా రాలే. నకిలీ విత్తనాలతో మోసపోయామని గుర్తించిన రైతులు విత్తనాలు కొన్న బిల్లులు లేకపోవడంతో ఏం చేయలేకపోయారు. ఒక రైతు ఇరవై ఎకరాల్లో పత్తి సాగు కోసం రూ.50 వేలు ఖర్చుపెట్టి విత్తనాలు కొన్నాడు. దుక్కి, కూలి ఖర్చులు అన్నీ కలిపి రూ.లక్షకు పైగా నష్టపోయాడు. నకిలీ విత్తనాలు కొన్న రైతులపైనా కేసులు పెడతామని అధికారులు హెచ్చరించడంతో బయటకు చెప్పుకోలేక కుమిలిపోయాడు. మళ్లీ రూ.లక్ష అప్పు చేసి విత్తనాలు నాటుకున్నాడు.  

నష్టపోయిన సోయా రైతులు

ఆదిలాబాద్ ​జిల్లాలోనూ గతంలో నకిలీ సోయా విత్తనాలతో రైతులు నష్టపోయారు. పరిహారం కోసం పలు గ్రామాల రైతులు కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ​రాష్ట్రాల నుంచి వ్యాపారులు నకిలీ విత్తనాలు తెచ్చి అంటగడుతూ ముంచుతున్నారు. ఈ నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.  

సబ్సిడీ ప్రకటించకపోవడంతో టెండర్ల రద్దు..

నిరుడు యాసంగి సీజన్​లో 2 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలను రైతులకు సప్లయ్​ చేయడానికి టీఎస్​ సీడ్స్ మార్చిలో​ టెండర్లు పిలిచింది. కొన్ని కంపెనీలు క్వింటాలుకు రూ.14 వేలకు టెండర్లు వేశాయి. చివరకు రూ.12 వేలకు క్వింటాలు చొప్పున సప్లయ్​ చేయడానికి ముందుకు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ప్రకటించకపోవడంతో టెండర్లను రద్దు చేసి సీడ్ సప్లయ్​ని నిలిపివేసింది. దీంతో వ్యాపారులు క్వింటాల్​కు రూ.15వేల వరకు విక్రయించారు.  

 రైతులు ఈ జాగ్రత్తలు పాటించాలి  

అగికల్చర్ ​డిపార్ట్​మెంట్ లైసెన్స్‌ పొందిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనాలి. సీడ్​ప్యాకెట్లు, బస్తాలపై పేరు, గడువు తేదీ వివరాలు గమనించాలి. కొనుగోలు చేసిన తర్వాత రశీదు, బిల్స్ తీసుకోవాలి. రశీదుపై విత్తన రకం, గడువు తేదీ, డీలర్‌ సంతకం తీసుకోవాలి. దానిపై రైతు సంతకం కూడా ఉండాలి. ఈ విత్తనాలు మొలకెత్తకున్నా, దిగుబడి రాకున్నా నష్టపరిహారం కోసం కోర్టులో కేసు వేయాలి.  

నష్టపరిహారం ఏది?  

సీడ్​ యాక్ట్​ 23ఏ రూల్​ ప్రకారం నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్ సంబంధిత వ్యాపారులు, కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించాలి. రైతులు కంప్లయింట్​ చేయగానే మండల వ్యవసాయాధికారి, విత్తనాలమ్మిన వ్యాపారి, విత్తన కంపెనీ ప్రతినిధి రైతు పొలానికి వెళ్లి తనిఖీ చేయాలి. నాసిరకం విత్తనాలని తేలితే వ్యాపారి నుంచి రైతుకు నష్టపరిహారం ఇప్పించేందుకు కోర్టులో పిటిషన్​ వేయాలి. లేదంటే రైతు తన దగ్గరున్న బిల్లులతో వినియోగదారుల ఫోరంలో కేసు వేయాలి. కానీ, కంపెనీలు ఇచ్చే నజరానాలకు ఆశపడి అగ్రికల్చర్​ ఆఫీసర్లు రైతుల గురించి పట్టించుకోవడం లేదు. రైతుల దగ్గర బిల్స్​ లేకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు.