నకిలీ వర్సిటీల వెనుక తండ్రీ కొడుకుల హస్తం : ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ ​

నకిలీ వర్సిటీల వెనుక తండ్రీ కొడుకుల హస్తం : ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ ​

హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో నకిలీ యూనివర్సిటీల వెనుక సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ హస్తం ఉందని బీఎస్పీ స్టేట్​ ప్రెసిడెంట్ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ ​ఆరోపించారు. విద్యను వ్యాపారం చేసినోళ్లకే సీఎం కేసీఆర్​ మంత్రి పదవులు కట్టబెట్టారని ఫైర్​ అయ్యారు. పీహెచ్​డీ అక్రమాలపై యాక్షన్​ తీసుకోవాలనే డిమాండ్​తో 29 రోజులుగా కేయూలో స్టూడెంట్​ జేఏసీ చేపట్టిన నిరసన దీక్షకు బుధవారం ఆయన సంఘీభావం తెలిపారు. ముందుగా పోలీసుల దాడిలో గాయపడినట్టు చెబుతున్న విద్యార్థులను పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గురునానక్, శ్రీనిధి, కావేరి వంటి నకిలీ యూనివర్సిటీలు వేలాది మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి దారుణంగా మోసం చేశాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలియకుండానే రాష్ట్రంలో నకిలీ యూనివర్సిటీలు వెలిశాయా..? అని ప్రశ్నించారు. మల్లారెడ్డి, అనురాగ్​, చైతన్య లాంటి  ప్రైవేటు వర్సిటీలతో విద్యను ప్రైవేటు పరం చేశారని, అదృశ్య శక్తిగా కేయూను నడిపిస్తున్న ఎమ్మెల్సీ పల్లా చేతిలో వర్సిటీ మొత్తం బందీ అయ్యిందన్నారు. వీటన్నింటి బదులు రాష్ట్రంలో కల్వకుంట్ల యూనివర్సిటీ పెట్టుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.  పీహెచ్​డీ రిజల్ట్స్ లో అక్రమాలు చేశారు కాబట్టే పబ్లిక్ డొమైన్ లో పెడ్తలేరని మండిపడ్డారు. పీహెచ్​డీ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని,  వర్సిటీలో అక్రమాలు జరుగుతుంటే ఉన్నత విద్యా మండలి చైర్మన్  ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేయూ పీహెచ్​డీ అక్రమాలపై వీసీ వెంటనే విద్యార్థులతో చర్చించాలని, సూపర్ ​న్యూమరిక్​ సీట్లతో విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. కేటీఆర్ వస్తున్నాడంటే ప్రశ్నించేటోళ్లందరినీ లోపలేస్తున్నారన్నారు. తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకుండా సీఎం కేసీఆర్​సిర్పూర్​ స్థానానికి మొదటి విడతలో రూ.300 కోట్లు  కేటాయించాడని, హుజూరాబాద్, మునుగోడుకు కూడా ఇలాగే తలో వేయి కోట్లు ఇచ్చాడని గుర్తు చేశారు. కేయూ స్టూడెంట్​ జేఏసీ  చైర్మన్ తిరుపతి యాదవ్, జేఏసీ నేతలు రాజు నాయక్, మల్లేశ్, జగదీశ్వర్ పాల్గొన్నారు.