
హనుమకొండ, వెలుగు: చత్తీస్ గఢ్– నారాయణపూర్ఎన్ కౌంటర్ లో మృతి చెందిన బుర్రా రాకేశ్ అలియాస్ వివేక్ మృతదేహాన్ని తమకు ఇవ్వకుంటే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామంటూ అతని తల్లి స్వరూప కన్నీరుమున్నీరుగా విలపించింది. కొడుకును చూసి, తొమ్మిదేళ్లయిందని, కనీసం శవాన్ని చూద్దామన్నా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం రాకేశ్ స్వగ్రామం హసన్ పర్తి మండలం చింతగట్టుకు వచ్చిన పౌరహక్కుల సంఘం, ప్రజా సంఘాల నేతలు మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు.
రాకేశ్‌తోపాటు మిగతా మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. డెడ్‌బాడీలను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టకుండా కుళ్లిపోయేలా వదిలేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని, డెడ్‌బాడీల అప్పగింతకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. పి.రమేశ్ చందర్, బి.రమాదేవి, జనగాం కుమారస్వామి, ఎం.వెంగల్ రెడ్డి, కళ, శాంత, జి.క్రాంతి, సంజీవ, ఉదయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
జాప్యం చేస్తున్నరు..
హైకోర్డు ఆర్డర్స్ఇచ్చినా మావోయిస్టుల మృతదేహాలను అప్పగించడంలో నారాయణపూర్ జిల్లా పోలీసులు జాప్యం చేస్తున్నారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపూర్ జిల్లా ఆస్పత్రి వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. మృతులు తమ కుటుంబ సభ్యులు అవునా.. కాదా.. అంటూ ఫ్యామిలీ ఫొటోలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేశవరావు అజ్ఞాతంలోకి వెళ్లి, దాదాపు 50 ఏళ్లవుతోందని, అలాంటప్పుడు ఫొటోలు ఎలా తెస్తామని ప్రశ్నించారు. డెడ్ బాడీల కోసం ఐదు రోజులుగా చూస్తున్నామని భూమిక, విజయలక్ష్మి, రాకేశ్, సంగీత కుటుంబ సభ్యులు వాపోయారు.
మృతదేహాలను వెంటనే అప్పగించాలి
నంబాల కేశవరావు, సజ్జ వెంకట నాగేశ్వరరావు, వన్నాడ విజయలక్ష్మి, గోనెగండ్ల లలిత, బుర్ర రాకేశ్ మృతదేహాలను వారి కుటుంబాలకు వెంటనే అప్పగించాలని మానవ హక్కుల వేదిక రెండు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు జీవన్కుమార్ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించుకునే హక్కు వారి కుటుంబసభ్యులకు ఉంటుందని పేర్కొన్నారు.