మంత్రి జగదీష్ రెడ్డిపై హెచ్చార్సీలో ఫిర్యాదు

మంత్రి జగదీష్ రెడ్డిపై హెచ్చార్సీలో ఫిర్యాదు

మంత్రి జగదీష్ రెడ్డిపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఆయన నుంచి రక్షణ కల్పించాలంటూ సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన ఓ కుటుంబం హెచ్చార్సీని ఆశ్రయించింది. సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడైన తన భర్త ఎల్లయ్యపై జగదీష్ రెడ్డి రాజకీయ కక్షతో అక్రమ కేసులు, పీడీ యాక్ట్ పెట్టి జైలు పాలు చేశారని వట్టే యాదమ్మ అనే మహిళ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు హత్యాయత్నం చేసినట్లు చెప్పారు. సూర్యాపేట ఎస్పీ, డీఎస్పీల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా మంత్రి ఆదేశాలతో మళ్లీ తన భర్తపైనే అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చేరనందుకే తమ కుటుంబాన్ని ఇలా వేధిస్తున్నారని బాధితురాలు హెచ్చార్సీకి వివరించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆయన అనుచరుడు వట్టే జానయ్య, జిల్లా ఎస్పీ, డీఎస్పీల నుంచి తన భర్తతో పాటు కుటుంబానికి రక్షణ కల్పించాలని యాదమ్మ హెచ్చార్సీని వేడుకున్నారు.