బీజేపీ టిక్కెట్ ఇప్పించండి.. సోనూ సూద్‌‌‌కు ఫ్యాన్ ట్వీట్

బీజేపీ టిక్కెట్ ఇప్పించండి.. సోనూ సూద్‌‌‌కు ఫ్యాన్ ట్వీట్

న్యూఢిల్లీ: కరోనా లాక్‌‌డౌన్ సమయంలో వలస కూలీలను ఇంటికి చేర్చడంలో సినీ నటుడు సోనూ సూద్ విశేష కృషి చేశాడు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా పలువురికి సాయం చేస్తూ సోనూ అందరి మన్ననలు పొందుతున్నాడు. ప్రజలను వారి ఇళ్లకు చేరుస్తూ, ఆహారం అందిస్తున్న సోనూను చాలా మంది మెచ్చుకుంటున్నారు. తమకు కావాల్సినవి అందించాలంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా పంపే మెసేజ్‌‌లకు సోనూ స్పందిస్తున్నాడు. అలా ఒక కుటుంబానికి ట్రాక్టర్, ఓ స్టూడెంట్‌‌కు పుస్తకాలు కొనిచ్చాడు. ఈ క్రమంలో తాజాగా ఒక నెటిజన్ తనకు వచ్చే బిహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించాల్సిందిగా సోనూకు ట్వీట్ చేశాడు.

‘సార్ ఈసారి బిహార్‌‌లోని భగల్‌‌పూర్ విధాన సభ నుంచి నేను పోటీ చేస్తా. అక్కడ గెలిచి సేవ చేస్తా. సోనూ సార్ నాకు బీజేపీ టిక్కెట్ ఇప్పించండి’ అని అంకిత్ అనే యూజర్ సోనూ సూద్‌‌కు ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సోనూ.. బస్సు, రైలు, విమాన టిక్కెట్లను మినహాయించి మరే టిక్కెట్ ఇప్పించడమూ నాకు రాదు సోదరా అంటూ రిప్లయి ఇచ్చాడు. ఈ సమాధానానికి నవ్వుతూ ఏడుస్తున్న ఎమోజీతోపాటు నమస్కారం సింబల్‌‌ను జత చేశాడు. మరో ట్విట్టర్ యూజర్ కూడా సోనూకు ఐఫోన్ కొనివ్వాలని ట్వీట్ చేశాడు. దీనికి స్పందనగా.. ‘నాకు కూడా ఐఫోన్ కావాలి. దాని కోసం నీకు 21 సార్లు ట్వీట్ చేస్తా’ అంటూ సోనూ ఫన్నింగ్ ఆన్సర్ ఇచ్చాడు.