సమస్యలు పరిష్కరిస్తే రైతులు సంతోషంగా ఇంటికెళ్తారు

సమస్యలు పరిష్కరిస్తే రైతులు సంతోషంగా ఇంటికెళ్తారు

మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇతర సమస్యలను కూడా వేగంగా పరిష్కరించాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారించే విషయంలో సాగదీత సరికాదని చెప్పారు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవడంతోనే అంతా అయిపోయిందని అనుకోవద్దని, కేంద్ర ప్రభుత్వం.. రైతులకు సంబంధించిన ఇతర సమస్యలపై రైతు సంఘాలతో కూర్చుని చర్చలు జరపాలని సూచించారు. సమస్యలు పరిష్కరిస్తే రైతులు సంతోషంగా ఇళ్లకు వెళ్లి పనులు చేసుకుంటారని మాయ అన్నారు. ఈ అంశాలను ఇంకా ఎక్కువగా నాన్చొద్దని మాయావతి సూచించారు. 

నా మంచి పనులు.. వాళ్ల గొప్పలా?

ఉత్తరప్రదేశ్‌లో తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులను.. సమాజ్‌వాదీ, బీజేపీ పార్టీలు చేసినట్లుగా సొంతం చేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నాయని మాయావతి ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తన హయాంలో చేసినంతగా మంచి పనులు చేయలేదని అన్నారు. ఇతర పార్టీల్లాగా తాము ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేయబోమని, తమది మాటల పార్టీ కాదని, చేతల పార్టీ అని చెప్పారు. మేనిఫెస్టోలు రిలీజ్ చేయకుండానే తాము చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఆమె తెలిపారు.