టైటానిక్ షిప్ తరహాలో ఇంటి నిర్మాణం చేసిన రైతు

టైటానిక్ షిప్ తరహాలో ఇంటి నిర్మాణం చేసిన రైతు

అభిరుచికి అనుగుణంగా ఓ వ్యక్తి తన ఇంటిని టెటానిక్ షిప్ తరహాలో నిర్మించుకున్నాడు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హెలెంచలో నివాసముంటున్న మింటూ రాయ్ అనే వ్యక్తి 25 సంవత్సరాల క్రితం తన తండ్రి మనోరంజన్ రాయ్‌తో కలిసి సిలిగురిలోని ఫసిద్వా ప్రాంతంలో స్థిరపడ్డాడు. వ్యవసాయం చేస్తూ కాలం వెల్లదీసే మింటూ సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. అది కూడా మామూలుగా కాదు. ఓ ఓడలా..

మింటూ రాయ్ కోల్‌కతాలో ఉంటున్నపుడే అతను తన ఇంటిని ఓడలా నిర్మించాలని అనుకున్నాడు.  అప్పటి నుంచి అదే తన మనసులో స్థిరపడిపోయింది. అయితే వారికి సహాయం చేసేందుకు ఏ ఇంజినీర్ సిద్ధంగా లేకపోవడంతో...  మింటూనే తన స్వంత చేతులతో ఈ ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.

డబ్బుల్లేక.. పని కోసం నేపాల్ వెళ్లి..

మింటూకు సొంతింటి కల ఉన్నా.. దాన్ని నిర్మించేందుక అతని వద్ద సరిపడా డబ్బులు లేకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తాపీ మేస్త్రీలు తీసుకునేంత డబ్బు అతని వద్ద లేకపోవడంతో తానే స్వయంగా నేపాల్ వెళ్లి  తాపీ మేస్త్రీగా మూడేళ్లు పనిచేసి పని నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతను తన సొంత ఇంటిని నిర్మించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఓడలాంటి అతని కలల సౌధం మెల్లగా సిద్ధం కావడం ప్రారంభమైంది.2010లో ఈ ఓడ లాంటి ఈ ఇంటిని నిర్మించడం ప్రారంభించానని మింటు చెప్పారు. ఈ నౌక 39 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రస్తుతం ఈ నౌక చుట్టుపక్కల ప్రజలను ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా మారింది. 

మింటూ 9.5 డెసిమల్ స్థలంలోనే ఈ ఇంటిని నిర్మించి ప్రజలను ఆశ్చర్యపరిచాడు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని పొదుపు చేసి ఈ ఇంటిపై పెట్టుబడి పెట్టి నేటికీ ఈ ఇంటి నిర్మాణానికి ఖర్చు చేస్తున్నాడు. ఈ ఇంటికి తన తల్లి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు మింటూ రాయ్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటి వరకు మింటూ ఈ ఇంటికి రూ.15 లక్షలు ఖర్చు చేశాడు. వచ్చే ఏడాదిలోగా ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నానని, తాను ఈ ఇంటి పై అంతస్తులో తర్వాత ఒక రెస్టారెంట్‌ని తెరవాలనుకుంటున్నానని స్పష్టం చేశాడు.