కలెక్టరేట్‌‌‌‌ ముందు రైతు ఆత్మహత్యాయత్నం

 కలెక్టరేట్‌‌‌‌ ముందు రైతు ఆత్మహత్యాయత్నం
  •  అడ్డుకున్న పోలీసులు.. వికారాబాద్‌‌‌‌లో ఘటన
  •  పట్టా భూముల కోసం లంచం ఇమ్మంటున్నరని రైతు ఆవేదన
  • తినడానికే లేదు.. లంచం ఎక్కడి నుంచి తేవాలని ఆత్మహత్యాయత్నం
  • అధికారులే సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపణ

వికారాబాద్‌‌‌‌, వెలుగు: తన భూమికి పట్టా ఇవ్వడానికి అధికారులు లంచం అడుగుతున్నారనే బాధతో ఖలీల్‌‌‌‌ అనే రైతు వికారాబాద్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌ ఎదుట సోమవారం ఆత్మహత్యకు యత్నించాడు. చెట్టుకు ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తున్న రైతును పోలీసులు అడ్డుకున్నారు. ధరణితో రైతులకు అన్యాయం జరుగుతోందని, పట్టా కోసం రోజుల తరబడి తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదని ఖలీల్‌‌‌‌ ఆరోపించారు. తినడానికే తిండి లేదని, లంచాలు ఇవ్వడానికి సొమ్ములు ఎక్కడి నుంచి తేవాలని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని వ్యక్తులతో ఏవేవో అప్లికేషన్లు పెట్టించి అధికారులే సమస్యలు సృష్టించి లంచాలు గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. పట్టాదారు పాస్‌‌‌‌ బుక్‌‌‌‌ ఇచ్చే అధికారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఉన్నందున, సామాన్యులు ఆయనను కలిసే పరిస్థితి లేదని చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికి అప్లికేషన్‌‌‌‌ పెట్టుకున్న వాళ్లు లక్ష రూపాయలు ఇస్తేనే కలెక్టర్ అప్రూవ్‌‌‌‌ చేస్తారని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులోని ధరణి ఆపరేటర్ చెప్పారని ఖలీల్‌‌‌‌ తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడుదామంటే ఆయన కలవడం లేదని ఆరోపించారు. సమస్యను పరిష్కరించకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడంతో ఖలీల్‌‌‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

లంచం ఇవ్వకుంటే ఫైల్స్ కదలట్లే..

లంచం ఇవ్వకుంటే రెవెన్యూ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఫైల్స్‌‌‌‌ ముందుకు పోవట్లేదని ఖలీల్‌‌‌‌తోపాటు కలెక్టరేట్‌‌‌‌కు వచ్చిన 10 మంది రైతులు చెప్పారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్పారని, అయితే ఇక్కడ మాత్రం పైసలిస్తే తప్ప పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణిలో సమస్యలన్నీ అధికారులు సృష్టించినవేనని ఆరోపించారు. లంచం ఇచ్చిన వాళ్లకు పట్టాలు ఇస్తున్నారని విమర్శించారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ బౌన్సర్లను పెట్టుకుని రైతులను ఆఫీసులోకి రానివ్వడం లేదన్నారు. క్యాంప్‌‌‌‌ ఆఫీసులోనే ఉండి డ్యూటీ చేస్తూ లంచం ఇచ్చిన వాళ్లకే పాస్‌‌‌‌ పుస్తకాలు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో ఏదైనా పనికోసం తహసీల్దారు ఆఫీసుకు వెళితే అక్కడ వేలల్లో లంచాలు అడిగేవారని, ఇప్పుడు కలెక్టర్ ఆఫీసుల్లో లక్షల్లో అడుగుతున్నారని చెప్పారు. ఏడాది కింద పూడూర్​ మండలం చీలీపూర్​ గ్రామంలో 6.20 ఎకరాల భూమి కొనుగోలు చేశామని, రెవెన్యూ ఆఫీసర్లు ఇప్పటికీ పట్టా ఇవ్వలేదని ఆరోపించారు.