
మహబూబాబాద్, వెలుగు: అప్పులబాధతో మరో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా శనిగపురం గ్రామ శివారులోని బోడ తండాలో సోమవారం జరిగింది. తండాకు చెందిన బోడ సిరి (38)కి 20 గుంటల భూమి ఉంది. మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట వేశాడు. తెగులు సోకి పంట పూర్తిగా దెబ్బతిన్నది. పురుగుమందులు వేసినా పంట దక్కలేదు. మిర్చి సాగు కోసం చేసిన అప్పులు, పాత అప్పులు కలిపి రూ.6 లక్షలకు పెరిగాయి. అప్పు ఎలా తీర్చాలో తెలియక సిరి ఆయన భార్య బోడ బోడి కొన్నాళ్లుగా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సిరి భార్య 15 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ట్రీట్‌మెంట్ కోసం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఆమె కండీషన్ సీరియస్‌గా ఉంది. భార్య ట్రీట్‌మెంట్‌కు డబ్బులు లేక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందిన సిరి తన పొలంలోని చెట్టుకు సోమవారం ఉరేసుకున్నాడు. గమనించిన రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిరికి అశోక్ (11), జగన్ (8) ఇద్దరు కొడుకులు ఉన్నారు.