
జగిత్యాల జిల్లాలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన పొరండ్ల రాజన్న (59) అనే రైతు పంట పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్ల పెళ్ళిళ్లకు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉన్న వ్యవసాయ భూమిని అమ్మినా బిడ్డల పెళ్లికి చేసిన అప్పులు పూర్తిగా తీరకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడని తెలిపారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.