
సినిమా ఇండస్ట్రీ చాలా ‘చిత్రం’గా ఉంటుంది. ఒక్క శుక్రవారం చాలు అన్ని లెక్కలు సరిచేయడానికి. ఒక హీరోకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చేదీ శుక్రవారమే. ఒక స్టార్ హీరో ఇమేజ్ డ్యామేజ్ కావడానికీ ఆ శుక్రవారమే కారణం. ఇలాంటి ఒక శుక్రవారం (జులై 18) బాలీవుడ్లో ‘సైయారా’ (Saiyaara) అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా ఫలితం, సినిమాకు దక్కిన ఆదరణ.. ‘సైయారా’ సినిమా సాధించిన కలెక్షన్స్.. బీటౌన్ హేమాహేమీలను ముక్కున వేలేసుకునేలా చేసింది.
ఈ సినిమాలో స్టార్ హీరో లేడు. స్టార్ హీరోయిన్ కూడా లేదు. హీరోహీరోయిన్.. ఇద్దరికీ ఇది తొలి సినిమానే కావడం విశేషం. అలాంటి ఈ సినిమా విడుదలైన 11 రోజుల్లో 256 కోట్లకు పైగా కలెక్షన్లను (Net Collections) సాధించి బీ-టౌన్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఒక సినిమా సూపర్ హిట్ అవడానికి.. పేరు మోసిన తారాగణం.. భారీ సెట్టింగ్స్ అక్కర్లేదని.. కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి ‘సైయారా’ సినిమా నిరూపించింది.
జులై 18న విడుదలైన ఈ సినిమా 11 రోజుల్లోనే 256 కోట్ల 75 లక్షల నెట్ సాధించి ఔరా అనిపించింది. గ్రాస్ కలెక్షన్స్ 350 కోట్లు దాటిపోయింది. ఒక రొమాంటిక్ డ్రామాగా మోహిత్ సూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘సైయారా’ సినిమా యూత్కు గట్టిగా ఎక్కేసింది. ఒకప్పుడు ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ఏ స్థాయి ఆదరణ దక్కిందో ఇప్పుడు ఈ ‘సైయారా’ సినిమాకు దాదాపు అంతే ఆదరణ దక్కింది. హిందీ సినిమాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన 25వ సినిమాగా ‘సైయారా’ నిలిచిందంటే ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా హీరోహీరోయిన్లు అహన్ పాండే (Ahaan Panday), అనీత్ పడా (Aneet Padda) మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ ఇద్దరి ఎమోషనల్ జర్నీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.
►ALSO READ | Sathi Leelavathi: కౌంటర్ డైలాగ్స్తో ‘సతీ లీలావతి’ టీజర్.. పెళ్లి తర్వాత లావణ్య మంచి సబ్జెక్టుతోనే!
బాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఈ ఇద్దరి వైపే చూస్తుంది. ఓవర్ నైట్ స్టార్డం దక్కింది. థియేటర్లలో ఈ సినిమా చూసిన వాళ్లలో నూటికి 99 శాతం హార్ట్ బ్రేక్ అయి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. స్టోరీ ప్లాట్ చాలా సింపుల్గా అనిపించినా.. హీరోహీరోయిన్ మధ్య పండిన భావోద్వేగం ‘సైయారా’ సినిమాను బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ చేసింది. ‘సైయారా’ విడుదలైన ఆరో రోజే 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. IMDb కూడా ఈ సినిమాకు 10కి 7.8 రేటింగ్ ఇచ్చింది.