ఇంకెన్ని సార్లు తిరగాలె.. నా పనెందుకు చేస్తలేరు?

ఇంకెన్ని సార్లు తిరగాలె.. నా పనెందుకు చేస్తలేరు?
  • నా భూమి ఆక్రమించుకున్నా పట్టించుకుంటలేరు
  • అప్లికేషన్లు పెట్టుకున్నా పరిష్కరిస్తలేరు
  • అసహనంతో ఆదిలాబాద్​ అడిషనల్ ​కలెక్టర్​ బల్లపై గుద్దిన రైతు

ఆదిలాబాద్, వెలుగు : తన భూమిని కాపాడలంటూ ఓ రైతు ఆదిలాబాద్ ​కలెక్టరేట్​ చుట్టూ తిరుగుతున్నాడు. సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం జరిగిన గ్రీవెన్స్​లో అడిషనల్​ కలెక్టర్​ బల్లపై గుద్ది ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాధితుడి కథనం ప్రకారం..బజార్ హత్నూర్ మండలంలో భూతాయి బి గ్రామానికి చెందిన గోవింద్​ తండ్రి గణపతి పేరిట ఆరెకరాల పొలం ఉండేది. గతేడాది అందులో 3 ఎకరాలను ఇతరులు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటినుంచి కొంత మంది తన భూమిని ఆక్రమించుకున్నారని, న్యాయం చేయాలని అధికారులు చుట్టూ తిరుగుతున్నాడు. గ్రీవెన్స్ లో సైతం పలుమార్లు ఫిర్యాదు చేశాడు. మూడు, నాలుగు సార్లు తిరిగినా పని కాకపోవడంతో ఆవేదనతో ఉన్నాడు.

సోమవారం ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో గ్రీవెన్స్​కు భార్య రత్నమాలతో కలిసి వచ్చి అప్లికేషన్​ ఇచ్చాడు. అడిషనల్​ కలెక్టర్​ నటరాజ్​దరఖాస్తు తీసుకుని సరే చూస్తామని చెప్పాడు. దీంతో సహనం కోల్పోయిన గోవింద్​..అడిషనల్​కలెక్టర్​బల్లపై గట్టిగా గుద్దాడు. ‘ఎన్నిసార్లు తిరగాలె.. ఇప్పటికే మూడు సార్లు కలెక్టర్ ఆఫీస్​కు వచ్చిన.. మీరేంజేస్తుండ్రు..నా పనెందుకు జేస్తలేరు’ అని ప్రశ్నించాడు. తమ పూర్వీకుల నుంచి ఉన్న భూమిని వేరేవాళ్లు ఆక్రమించుకున్నారని, ధరణిలో మూడెకరాలే చూపిస్తోందని, మిగతా మూడెకరాలను వేరే వాళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వాపోయాడు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు గోవింద్​ను తీసుకువెళ్లారు. అడిషనల్ ​కలెక్టర్ ​నటరాజ్​గోవింద్​ భార్యను పిలిపించుకుని మాట్లాడారు. ‘ఇది సివిల్ ​మ్యాటర్ ​కాబట్టి కోర్టులోనే తేల్చుకోవాలి’ అని చెప్పి పంపించారు.