చేనులో పత్తి ఏరుతుండగా పులి దాడి, రైతు మృతి

చేనులో పత్తి ఏరుతుండగా పులి దాడి, రైతు మృతి

చుట్టుపక్కలవాళ్లు అరవడంతో బాడీని వదిలేసి పరార్
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ఘటన
గతంలో ఇదే ప్రాంతంలో ఇద్దరిని బలిగొన్న పులి

ఆసిఫాబాద్, వెలుగు: చేనులో పత్తి ఏరుతుండగా రైతుపై పులి దాడి  చేసింది. పొదల్లోకి లాక్కెళ్లి చంపేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్ శివారులో మంగళవారం ఈ ఘటన జరిగింది. వాంకిడి మండలం చౌపన్ గూడ పరిధిలోని ఖానాపూర్​కు చెందిన గిరిజన రైతు సిడాం భీము(69) మంగళవారం ఉదయం భార్య, కొడుకుతో కలిసి తన చేనులో పత్తి ఏరేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం సద్ది తిన్నాక భార్య, కొడుకు ఒక వైపు, భీము మరో వైపు పత్తిని ఏరుతుండగా భీముపై పెద్ద పులి హఠాత్తుగా దాడి చేసింది. వెనుక నుంచి పంజా విసిరి మెడను పట్టుకుంది. భయంతో భీము కేకలు పెట్టాడు. అతని భార్య, కొడుకులతో పాటు పక్కనున్న చేన్లలో పని చేస్తున్న రైతులు, పశువుల కాపారులంతా గట్టిగా కేకలు పెట్టారు. అప్పటికే భీమును 20 మీటర్ల దూరం దాకా ఈడ్చుకెళ్లిన పులి.. వీళ్ల అరుపులు విని భీముని అక్కడే వదిలి పారిపోయింది. దగ్గరలోనే పోడు భూముల సర్వే చేస్తున్న ఫారెస్ట్ అధికారులకు రైతులు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి చూసేలోపే భీము ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య జంగుబాయి, ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలున్నారు. 

ఇదివరకు ఇద్దరు..

ఇదే ప్రాంతంలో పెద్దపులి దాడిలో గతంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన సిడం విఘ్నేశ్ (20 ) 2020 నవంబర్ 11 న పులి బారిన పడి చనిపోయాడు. కాగజ్ నగర్ డివిజన్ పెంచికల్ పేట్ మండలం కొండపల్లిలో అదే ఏడాది నవంబర్ 29 న చేనులో పత్తి ఏరుతున్న పసుల నిర్మల(19) అనే యువతిపై పులి దాడి చేసి హతమార్చింది.

పులిదాడిలో కోడె మృతి

దహెగాం, వెలుగు: దహెగాం మండలంలోని ఖర్జి అడవిలో పులి దాడితో కోడె చనిపోయింది. లంగారి వెంకటేశ్​కు చెందిన కోడె ఆదివారం అటవీప్రాంతంలోకి మేతకు వెళ్లి తిరిగి రాలేదు. కోడెకోసం రెండ్రోజులుగా వెతుకుతుండగా మంగళవారం అడవిలో చనిపోయి కనిపించింది. కోడెను పెద్దపులి చంపేసిందని ఫారెస్ట్​ ఆఫీసర్లకు వెంకటేశ్​సమాచారం ఇచ్చారు.