- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం/మధిర/ఎర్రుపాలెం, వెలుగు : రైతులు పంటల సాగుతో పాటు అదనపు ఆదాయం సమకూర్చుకునేలా ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రైతులు పంపు సెట్ల దగ్గర సోలార్ ప్యానల్స్ అమర్చుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందొచ్చన్నారు. గురువారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గర్లపాడు సోలార్ పంప్‌సెట్లు, చిన్నబీరవల్లిలో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యావరణహిత ఇంధన వనరులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. బోనకల్ మండలంలో రూఫ్‌టాప్ సోలార్ పనులు 50 శాతం పూర్తయ్యాయని, అగ్రికల్చర్ పంప్‌సెట్ల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు.
నాణ్యమైన విద్యుత్‌ను అందించడం ద్వారా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రెండన్నర ఏండ్లలోనే సుమారు 3,542 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగినట్లు చెప్పారు.
అకాల వర్షాల కారణంగా తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఆర్థిక శాఖ నుంచి రూ. 5 వేల కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. రెండున్నరేండ్లుగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసినా సరైన స్పందన లేదన్నారు. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ప్రతి గింజను కేంద్రం తీసుకునేలా బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలన్నారు.
బీజేపీ నాయకులు మాయమాటలతో రైతులను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వార్తల్లో ఉండేందుకే మాజీమంత్రి హరీశ్‌రావు ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రైతులకు చేస్తున్న మంచిని చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక పోతున్నారన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, రెడ్కో వైస్ చైర్మన్ అనీల, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం మధిర నియోజకర్గంలోని వివిధ గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
