హుస్నాబాద్, వెలుగు: వచ్చే ఖరీఫ్ సీజన్‌లో రైతులు సన్న వడ్లు పండించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని ఏఎంసీ గోదాములను పరిశీలించారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు మార్కెట్ కమిటీ పరిధిలోని 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గోదాముల్లో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల ధాన్యాన్ని నిల్వ చేస్తున్నామని తెలిపారు.
పందిళ్లలోని షణ్ముఖ, గౌరీశంకర్, పవనసుత రైస్ మిల్లులను పరిశీలించి, కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు ఆదేశించారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రూ.77.20 కోట్లతో జరుగుతున్న ఫోర్ లేన్ రోడ్డు పనులను కూడా ఆమె పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
