మక్కలు, వడ్లు కొంటలేరని.. రైతుల రాస్తారోకో

మక్కలు, వడ్లు కొంటలేరని.. రైతుల రాస్తారోకో

కమలాపూర్/ మహబూబాబాద్​​ అర్బన్, వెలుగు: కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసుకువచ్చి 20 రోజులైనా  కొనడంలేదంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్​లో సోమవారం రైతులు ఆందోళనకు దిగారు.  మినీ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసి పీఏసీఎస్​ మక్కల కొనుగోలు కేంద్రంలో  కొనుగోళ్లలో జాప్యం,  గోనె సంచుల  కొరతపై ఆగ్రహించిన రైతులు హుజూరాబాద్, పరకాల రోడ్డులో  ధర్నా, రాస్తారోకో చేశారు. కొనుగోళ్లలో అధికారుల  తీరుపై మండిపడ్డారు. కొనుగోలు వేగవంతం చేయాలని  డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో  పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపచేశారు. మక్కల కొనుగోలుపై  రైతులు రోడ్డెక్కడం వారం రోజుల్లో ఇది రెండోసారి. 

రోడ్డెక్కిన రైతన్నలు, ధాన్యం దగ్దం

మహబూబాబాద్​ మండలం పర్వతగిరి కొనుగోలు కేంద్రంలో వడ్లు కొనడంలేదని, కొన్న వడ్లను తరలించడం లేదని సోమవారం(జూన్ 05) సీపీఐ ఆధ్వర్యంలో రైతులు అందోళన చేపట్టారు. మహబూబాబాద్, చిన్నగూడూర్​మెయిన్​రోడ్డుపై  వడ్లబస్తాలు, ముండ్లకంప వేసిరాస్తారోకో చేసిన రైతులు వడ్లను కాలబెట్టారు.  కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి  రెండు నెలలైనా  వడ్లు కొనడం పూర్తి కాలేదని, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని  సీపీఐ లీడర్లు  పెరుగు కుమార్,  తండా సందీప్ ఆరోపించారు. దశాబ్ది సంబరాలు చేసుకుంటున్న సర్కారు  రైతులను  పట్టించుకోవడంలేదన్నారు. ఐకేపీ సెంటర్లలో రైతులు  నిలువ దోపిడికి గురవుతున్నారని,   బస్తాకు నాలుగైదు కేజీల వరకు వడ్లను మిల్లర్లు కోత పెడుతున్నారని అన్నారు. రాస్తారోకోతో ట్రాఫిక్​ నిలిచిపోవడంతో రూరల్ ఎస్​ఐ రామ్ చరణ్, డీపీఎం నళిని, ఏపీఎం తిలక్ కుమార్​అక్కడకొచ్చి  రైతులతో మాట్లాడారు. తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు.