నిరసనలతో దద్దరిల్లిన జగిత్యాల కలెక్టరేట్

నిరసనలతో దద్దరిల్లిన జగిత్యాల కలెక్టరేట్

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ పోటాపోటీ నిరసనలతో దద్దరిల్లింది. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు, తమ సమస్యలను పరిష్కరించాలని సెకండ్ ఏఎన్ఎంలు కదంతొక్కారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కలెక్టరేట్ ముందు అంబరిపేట, హస్నాబాద్ రైతులు నిరసనకు దిగారు. కలెక్టర్ వచ్చి తమ వినతిపత్రం స్వీకరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ను కలిసేందుకు అనుమతివ్వాలని కోరగా.. పోలీసులు ఐదుగురికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. వారు కార్యాలయంలోకి వెళ్లగా కలెక్టర్ రవి అందుబాటులో లేకపోవడంతో ఏవోకు వినతిపత్రం అందజేశారు.  

మరోవైపు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెకండ్ ఏఎన్ఎంలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. దాదాపు నాలుగు గంటల పాటు నిరసన కొనసాగించారు. కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి తమను రెగ్యులరైజ్ చేయాలని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎండ తీవ్రతకు కల్లెడ గ్రామానికి చెందిన మమత అనే ఏఎన్ఎం సొమ్మసిల్లి పడిపోగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.