అరెస్టులు చేస్తున్నా ఆగని..నకిలీ సీడ్​ దందా

 అరెస్టులు చేస్తున్నా ఆగని..నకిలీ  సీడ్​ దందా

యాదాద్రి, వెలుగు : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలతో పాటు బీటీ–-3 విత్తనాల దందా జోరుగా సాగుతోంది. విడిగా అమ్ముతున్న విత్తనాలు తక్కువ ధరకే లభిస్తుండడంతో రైతులు కొనుగోలు చేస్తున్నారు.  ప్రభుత్వం నిషేధించిన బీటీ-–3 విత్తనాల రేటు కాస్త ఎక్కువైనా కలుపు, కూలీ కలిసి వస్తుందని రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల నిషేధిత బీటీ–-3 విత్తనాలతో పాటు విడి విత్తనాలను అమ్మే వారిని అరెస్ట్​ చేసినా అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. 

లక్ష ఎకరాలకు పైనే పత్తి సాగు

  జిల్లాలో 2019 నుంచి లక్ష ఎకరాలకు తగ్గకుండా పత్తి సాగు అవుతోంది. 2020లో 1.59 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. 2021లో 1.40 లక్షలు,  2022 లో 1.10 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది కంటే ఎక్కువగా ఈ సీజన్​లో 1.24 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని ఆఫీసర్లు అంచనా వేశారు. రైతులు కూడా ఆ స్థాయిలో దుక్కులు దున్ని రెడీగా ఉన్నారు. 

మార్కెట్లోకి లూజ్​ సీడ్స్​

ప్రతి సీజన్​ తరహాలోనే ఇప్పుడు మార్కెట్లోకి పత్తి విత్తనాలను ప్యాకెట్లలో  విడిగా సేల్స్​ చేస్తున్నారు. కంపెనీలు ఇచ్చే రేటు కంటే ఈ విత్తనాలను సగం ధరకు ఇవ్వడంతో పాటు గ్రామాల్లోకి వచ్చి సేల్స్​ చేస్తున్నారు. ఈ విత్తనాలు ఏపీ నుంచి ఎల్బీ నగర్​కు చేరుకొని అక్కడి నుంచి చుట్టుపక్కల జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది.  జిల్లాలో మొత్తం 195 షాపుల్లో విత్తనాలు అమ్ముతున్నప్పటికీ, షాపుల్లో కంటే విడిగా వస్తున్న విత్తనాలనే రైతులు ఎక్కువగా  కొనుగోలు చేస్తున్నారు. 

పర్యావరణానికి ప్రమాదకరంగా బీటీ-–3  

 బీటీ--–3 విత్తనాలతో కలుపు సమస్య పరిష్కారం అవుతుందని ప్రచారం చేస్తున్నారు. కలుపు మందు చల్లినా బీటీ–-3 విత్తనాలతో సాగు చేస్తున్న పత్తి మొక్కలకు ఎలాంటి నష్టం వాటిల్లడం లేదు. దీంతో రైతులు కూడా ఈ విత్తనాల వైపు మొగ్గు చూపుతున్నారు.  కిలో విత్తనాలకు రూ.వెయ్యి ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు.   పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన బీటీ--–3 విత్తనాలతోశ్వాసకోశ సమస్యలు వస్తాయని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో వీటిని  ప్రభుత్వం నిషేధించింది. అయితే జెనటిక్​ టెస్ట్​ చేస్తే కానీ అవి బీటీ-–3 విత్తనాలో కాదో  తెలుసుకోవడం కష్టమని చెబుతున్నారు. 

ALSO READ :ఖమ్మం కాంగ్రెస్​లో పొంగులేటి అలజడి..చేరిక ఖాయం కావడంతో ఆశావాహుల్లో టెన్షన్

అరెస్ట్​ చేస్తున్నా ఆగని దందా

బీటీ-3, లూజ్​ సీడ్స్​ అమ్మేవారిని అరెస్ట్​ చేస్తున్నా దందా ఆగడం లేదు. ఈ నెల మొదటి వారంలో చౌటుప్పల్ లో రూ. 70 లక్షల విలువగల  22 క్వింటాళ్ల బీటీ-–3 విత్తనాలను ఎస్వోటీ పోలీసులు  సీజ్​ చేశారు. ​ ఏపీ, మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని అరెస్ట్​ చేశారు.  మోటకొండూరు, ఆలేరు మండలాల్లో ఇటీవల విడి విత్తనాలతో పాటు బీటీ– -3 విత్తనాలను సేల్స్​ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అగ్రికల్చర్​, పోలీస్​ డిపార్ట్​మెంట్​తో సంయుక్తంగా ఏర్పాటైన స్క్వాడ్​ టీమ్స్​ కూడా షాపుల్లో విత్తనాలను పరిశీలిస్తూ శాంపిల్స్​ సేకరిస్తున్నారు.