కౌలు రైతుకు ఆపతి : పంట పండక.. అప్పు తీరక.. సాయం అందక.. సచ్చిపోతున్నరు

కౌలు రైతుకు ఆపతి : పంట పండక.. అప్పు తీరక.. సాయం అందక.. సచ్చిపోతున్నరు

 

  1. ఆరున్నరేండ్లలో 4,200 మందికిపైగా ఆత్మహత్య
  2. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న దంపతులు
  3. మంచిర్యాల జిల్లా మల్కెపల్లిలో ఘటన
  4. ఓ ఎకరం భూమి ఉన్నా అమ్ముకుని అప్పుతీర్చేటోళ్లం
  5. ఏడెనిమిది లక్షల కోసం 4 ప్రాణాలు పోతున్నయ్
  6. సూసైడ్ నోట్​లో కౌలు రైతు
  7. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే ఎక్కువ
  8. సిద్దిపేటలో 624 మంది బలవన్మరణం
  9. కౌలుదారులను రైతులుగా గుర్తించని రాష్ట్ర సర్కారు
  10. రైతు బీమా, రైతుబంధు, విత్తన సబ్సిడీలు ఇస్తలే
  11. పాస్​బుక్కు లేక ఎంఎస్పీకి పంట అమ్ముకోలేని దుస్థితి
  12. ఒడిశా, ఏపీలో కౌలు రైతులకూ పెట్టుబడి సాయం 
  13. మన దగ్గర జీఓ 194 ప్రకారం ఎక్స్​గ్రేషియా కూడా ఇస్తలే

రైతు వేదిక సాక్షిగా ఆత్మహత్య

వరంగల్ అర్బన్ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన సాదిరం రాంచందర్ (45).. ఐదెకరాలు కౌలుకు తీసుకుని 15 ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. పెట్టుబడి, కౌలు చెల్లింపుల కోసం రూ.1.5 లక్షల వరకు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేక, తన లాంటి వారి బాధ సర్కార్​కు తెలియాలని రైతు వేదిక భవనంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకున్న 8 గుంటల సొంత భూమిపై పట్టాదార్ పాస్ బుక్ రాకపోవడంతో రైతు బీమా బాండ్ రాలేదు. దీంతో ఇంటి పెద్ద చనిపోయి, బీమా అందక రాంచందర్ భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు రోడ్డునపడ్డారు.

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. దిగుబడి సరిగ్గా రాక, పండిన పంటకు రేటు లేక, పెట్టుబడి సాయమందక కౌలు రైతులు ప్రాణాలు వదులుతున్నారు. గత ఆరున్నరేండ్లలో 5,569  మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. వీరిలో 4,200 మందికి పైగా కౌలు రైతులే ఉన్నారు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను ప్రభుత్వం రైతులుగానే గుర్తించకపోవడం.. ఎలాంటి పథకాలు అమలు చేయకపోవడంతో వారు మరింతగా ఆపతిలో చిక్కుకుంటున్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట 624 మంది రైతుల ఆత్మహత్యలతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. 592 మంది ఆత్మహత్యలతో నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉన్నట్లు రైతు స్వరాజ్య వేదిక (ఆర్‌‌ఎస్‌‌వీ) ఈ మధ్య వెల్లడించింది. ఈ లెక్కలన్నీ రాష్ట్రంలోని పోలీస్‌‌ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌‌ఐఆర్‌‌ల ఆధారంగా రూపొందించిన డిస్ట్రిక్ట్‌‌ క్రైం బ్యూరో రికార్డు (డీసీబీఆర్‌‌)ల ప్రకారమేనని, ఇంకా రిపోర్ట్‌‌ కాని ఆత్మహత్యలు ఉంటాయని ఆర్‌‌ఎస్‌‌వీ 
ప్రతినిధులు చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సకినాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు మడవి దేవోజీ భార్య పేరిట రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తుండే వాడు. ఈ క్రమంలోనే గత ఆరేళ్లలో పంట పెట్టుబడులు, బోర్లు వేయడానికి సుమారు రూ.3 లక్షల ప్రైవేట్ అప్పు, రూ.లక్ష క్రాప్​ లోన్ తీసుకున్నాడు. అప్పులు పెరిగిపోవడంతో అవి ఎలా తీర్చాలో తెలియక 2020 నవంబర్ 24న తన పత్తి చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ భూమి దేవోజీ భార్య పేరిట ఉండడంతో ఆయనకు రైతు బీమా వర్తించలేదు.
సాయం చేస్తలే

వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు రైతుబంధు, బ్యాంకు రుణంతోపాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. రైతుగా ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో చివరికి రైతు బీమా కూడా వర్తించడం లేదు. కౌలు రైతులను గుర్తించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2011లో తీసుకొచ్చిన భూఆధీకృత సాగుదారుల చట్టం అమలును ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కౌలు రైతులకు శాపంగా మారింది. రాష్ట్రంలోని రైతుల్లో 30 శాతానికిపైగా (సుమారు 15 లక్షల మంది) కౌలు రైతులు ఉండగా, వారిలో కేవలం 15 వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు జారీ అయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 80 శాతం మంది కౌలురైతులే ఉంటున్నారు. రైతు బీమా స్కీం రాక ముందు వయస్సు, భూమితో సంబంధం లేకుండా నిజంగా పంట నష్టపోయిన, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం వచ్చే అవకాశం ఉండేదని, రైతు బీమా పథకంలో ఉన్న రూల్స్ కారణంగా కౌలు రైతులకు అర్హత లేకుండా పోయిందని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ కొండల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి ఇనాం భూములు, పోడు రైతులు, రైతు 60 ఏళ్లపైబడ్డాక పంట నష్టపోయి, అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం ఆయా కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం లేదు.
ఏపీలో ‘భరోసా’.. ఒడిశాలో ‘కాళియా’

రాష్ట్రంలో ఇస్తున్న రైతుబంధు తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లోనూ నగదు సాయం అందజేస్తున్నారు. ఒడిశాలో వాస్తవంగా వ్యవసాయం చేసే రైతులతోపాటు వ్యవసాయ అనుబంధ వృత్తులు చేసేవారికి కూడా ‘కాళియా’ పథకం ద్వారా నగదు సాయం అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు, కౌలు రైతులకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద అక్కడి ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తోంది. భూములు ఉన్న పట్టాదారులకు, కౌలు రైతులకు రూ.13,500 చొప్పున ఏపీ ప్రభుత్వం నగదు సాయం అందజేసింది. కానీ మన దగ్గర కౌలు రైతులు తమ దృష్టిలో రైతులు కారని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. వారికి ఎలాంటి సంక్షేమ పథకాలను వర్తింపజేయడం లేదు.
తగ్గిన దిగుబడి.. పెరిగిన పెట్టుబడి
షరతుల సాగు పేరిట రాష్ట్ర ప్రభుత్వమే పత్తి సాగును ప్రోత్సహించింది. రైతులు రూ. లక్షలు అప్పు చేసి, పెట్టుబడిగా పెట్టి పత్తి సాగు చేస్తున్నారు. నష్టాలు వస్తున్నా మరుసటి ఏడాదీ అదే పంట వేస్తున్నారు. పత్తి బాగా పండి, రేటు మంచిగా వస్తే అప్పులన్నీ తీర్చుకోవచ్చని, కుటుంబ ఆర్థిక అవసరాలు తీరుతాయని రైతులు ఆ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఇతర పంటలు సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడి, అప్పులు తీర్చే స్థాయిలో డబ్బులు వచ్చే పరిస్థితి లేదని పత్తి రైతులు పేర్కొంటున్నారు. అందుకే ఈ సారైనా పంట పండకపోదా? ధర రాకపోదా? అనే ఆశతో మళ్లీ ఆ పంటనే సాగు చేస్తున్నట్లు చెబుతున్నారు.రంగారెడ్డి    181

  • మేడ్చల్    22
  • వికారాబాద్    287
  • సంగారెడ్డి    167
  • సిద్దిపేట    624
  • మెదక్    213
  • నిర్మల్    139
  • ఆసిఫాబాబాద్    70
  • ఆదిలాబాద్    333
  • మంచిర్యాల    82
  • భద్రాద్రి కొత్తగూడెం    84
  • ఖమ్మం    145
  • సూర్యాపేట    86
  • నల్గొండ    592
  • యాదాద్రి    132
  • కరీంనగర్    160
  • జగిత్యాల    123
  • పెద్దపల్లి    96
  • సిరిసిల్ల    117
  • నిజామాబాద్    87
  • కామారెడ్డి    123
  • వనపర్తి    101
  • నాగర్ కర్నూల్    220
  • గద్వాల    67
  • మహబూబ్‌నగర్    214
  • మహబూబాబాద్    79
  • జనగామ    139
  • వరంగల్ అర్బన్, రూరల్     622
  • జయశంకర్     264
  • మొత్తం    5,569

80 శాతం కౌలు రైతులే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేవలం 1,125 మంది రైతులే ఆత్మహత్య చేసుకున్నారని మొన్న శాసన మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పడం దారుణం. నిజానికి 5,569 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. వీరిలో 80 శాతం మంది వాస్తవ సాగుదారులైన కౌలు రైతులే. కానీ ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించటం లేదు.  రాజకీయ పార్టీలు కూడా కౌలు రైతుల గురించి మాట్లాడటం లేదు. వ్యవసాయం చేసే వాళ్లు ఎవరు ఆత్మహత్యకు పాల్పడినా జీవో నంబర్ 194 ప్రకారం పరిహారమివ్వాలి.
                                                                                                                                                                                             - బి.కొండల్ రెడ్డి, కన్వీనర్, రైతు స్వరాజ్య వేదిక