వరికోతలకు రైతుల పాట్లు..పెరిగిన ఖర్చులు

వరికోతలకు రైతుల పాట్లు..పెరిగిన ఖర్చులు

రాష్ట్రంలో వరి కోతలకు రైతులు ఇబ్బందులు పడుతున్నరు. ముందుగా నాట్లు వేసిన జిల్లాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. జులై ప్రారంభంలో నాట్లేసిన పొలాల్లో కోతలు వేగం పుంజుకున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండి కోతలు ఒక్కసారిగా షురూ కావడంతో హార్వెస్టర్లకు  డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఏర్పడింది. ఈ వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రంలో వరి 45 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా.. రికార్డు స్థాయిలో 65 లక్షల ఎకరాలకు పైగా వరి సాగైంది. కోటి 40 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో కోటి టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.

హార్వెస్టర్లు, చైన్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌లకు డిమాండ్‌‌‌‌‌‌‌‌..

రాష్ట్రంలో పొలాలన్నీ ఒకేసారి కోత దశకు చేరుకోవడంతో హార్వెస్టర్లకు గిరాకీ పెరిగింది. ఈ ఏడాది కురిసిన అత్యధిక వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి అనేక చోట్ల కోతకు సిద్ధంగా ఉన్న పంట పొలాల్లో వరి కోత మిషన్లు దిగబడుతున్నాయి. దీంతో ఫోర్‌‌‌‌‌‌‌‌వీలర్‌‌‌‌‌‌‌‌, చైన్‌‌‌‌‌‌‌‌మిషన్‌‌‌‌‌‌‌‌ (ట్రాక్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌)లకు మరింత డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరిగింది.  బురద లేకుంటే హార్వెస్టర్‌‌‌‌‌‌‌‌కు గంటకు రూ.2,200 నుంచి రూ.2,500 చొప్పున వసూలు చేస్తున్నారు. నిరుడు గంటకు రూ.1,800 నుంచి రూ.2 వేలు ఉండగా.. ఈయేడు 500 పెరిగింది. ఎకరం పొలం కోయడానికి గంట్నర పడుతోంది. నిరుడు రూ.3 వేలకు ఎకరం పొలం కోయగా.. ఈయేడు అదనంగా రూ.750 అవుతోంది. బురద ఉన్న పొలాల్లో చైన్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌, ఫోర్‌‌‌‌‌‌‌‌ వీలర్‌‌‌‌‌‌‌‌ సాయంతో కోస్తే గంటకు రూ.3,600  వసూలు చేస్తున్నారు. నిరుడుతో పోలిస్తే  ఈయేడు గంటకు రూ.600 పెరిగింది. ఎకరానికి  రూ.900 వరకు ఖర్చు అవుతోంది. సాధారణ హార్వెస్టర్‌‌‌‌‌‌‌‌కు బదులు చైన్‌‌‌‌‌‌‌‌ మెషిన్‌‌‌‌‌‌‌‌తో కోస్తే రూ.3 వేలతో అయ్యేది  ఈ ఏడాది  రూ.5,400 వరకు ఖర్చు అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూలీల కొరత.. 

కోతకు వచ్చిన పొలం  కోద్దామంటే హార్వెస్టర్లు, కూలీలు దొరకడం లేదని రైతులు పేర్కొంటున్నారు. రోజుకు రూ.350  ఇస్తామన్నా కూలొళ్లు దొరకుతలేరని వాపోతున్నరు.  తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌, పంజాబ్‌‌‌‌‌‌‌‌, హర్యానా రాష్ట్రాల నుంచి వచ్చే హార్వెస్టర్లు ఇంకా రాలేదు. దీంతో గ్రామాల్లో హార్వెస్టర్ల కొరత కనిపిస్తోంది.  ఇతర రాష్ట్రాల నుంచి మిషన్లు రాక, ఇక్కడి హార్వెస్టర్లలో చైన్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌లు లేక కోతలు కష్టంగా మారిందని రైతులు అంటున్నారు. మరోవైపు చెడగొట్టు వానలు పడుతుండడంతో అటు పంట కోయలేక.. కోసిన పంట కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. 

ప్రత్యేక యాప్‌‌‌‌‌‌‌‌ ఏమైందో..

వరి కోతల కోసం వ్యవసాయశాఖ ప్రత్యేక యాప్‌‌‌‌‌‌‌‌ రూపొందిస్తున్నట్లు గతంలో చెప్పింది. హార్వెస్టర్లు, ట్రాక్టర్లు బుక్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న వెంటనే వచ్చేలా ఊబరైజ్‌‌‌‌‌‌‌‌ చేసి రైతు యాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఓలా, ఊబర్‌‌‌‌‌‌‌‌ తరహాలో యాప్‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. కానీ, రెండేండ్లు అయినా ఇప్పటి వరకు అలాంటి యాపే రూపం దాల్చలేదు. దీంతో ఎప్పటిలాగే రైతులు వరి కోతల కోసం యంత్రాలు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు కోస్తయో అని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడుతోంది.