యాసంగి సాగుకు కష్టమొచ్చింది

యాసంగి సాగుకు కష్టమొచ్చింది

యాసంగి సాగుకు కష్టమొచ్చింది
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 49 శాతానికే పరిమితమైన పంటల సాగు
వేసవి ప్రారంభం కాకుండానే కరెంట్​ కోతలు షురూ
వరి సాగుపై ఆసక్తి  చూపని రైతులు
ఆరుతడి పంటలదీ అదే పరిస్థితి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వేసవిలో కరెంట్​ కష్టాలు తప్పక పోవచ్చనే ఉద్దేశంతో రైతులు యాసంగిలో పంటలు సాగు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటి నుంచే 24 గంటల కరెంట్ సక్కగా రావడం లేదు. ముందు ముందు కరెంట్ కోతలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. దీంతో యాసంగి సాగుకు నీరందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వారు కొన్ని ఎకరాలను సాగు చేయకుండా వదిలేస్తున్నారు. నీళ్లు అందే వరకే సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు 50శాతం కూడా సాగుకు నోచుకోలె. మరోవైపు గోదావరి వరదలు, నిరంతరంగా కురిసిన వానలతో యాసంగి సాగు లేటయిందని, దీంతో దిగుబడి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

సగం కూడా సాగు కాలే..

జిల్లాలో 2020–21లో 1,74,475ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 2,15,463 ఎకరాల్లో యాసంగి సాగు అవుతుందని అధికారులు ప్లాన్​ చేశారు. అయితే ఇప్పటి వరకు కేవలం 1,04,688ఎకరాల్లో మాత్రమే సాగైంది. 78,762ఎకరాల్లో వరి సాగవుతుందని భావించగా, 10,883 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. 2,147ఎకరాలకు గాను 54 ఎకరాలకే జొన్న సాగు పరిమితమైంది. 26,156 ఎకరాలకు గాను 9,044 ఎకరాల్లో మొక్కజొన్న, 2,896 ఎకరాలకు గాను 158 ఎకరాల్లో పెసర, 2,617 ఎకరాలకు గాను 444 ఎకరాల్లో అలసంద, 2,112 ఎకరాలకు గాను 64 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 1,123 ఎకరాలకు గాను 34 ఎకరాల్లో నువ్వులు, 3,864 ఎకరాల్లో కూరగాయలకు గాను 199 ఎకరాల్లో మాత్రమే యాసంగి సాగు అయినట్లు అగ్రికల్చర్​ ఆఫీసర్లు గుర్తించారు. 

కరెంట్​ కష్టాలు షురూ..

యాసంగి సాగులో కరెంటే కీలకం. వ్యవసాయానికి 24 గంటల కరెంట్​ ఫ్రీగా ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటుంది. కాగా జిల్లాలో ఎక్కడా 24 గంటల కరెంట్  సప్లై కావడం లేదని రైతులు అంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 6 నుంచి 12 గంటలు మాత్రమే కరెంట్​ సప్లై అవుతోందని చెబుతున్నారు. యాసంగి సాగు ఆలస్యం అయిందని, పంట చివర్లో కరెంట్ సక్రమంగా ఇయ్యకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదలు, వర్షాలతో ఇప్పటికే వానాకాలం సాగులో ఆర్థికంగా నష్టపోయామని, యాసంగి సాగు లేట్​ కావడంతో 24 గంటల కరెంట్​ ఇయ్యకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇదిలాఉంటే వరి అంతంతమాత్రంగా సాగు చేసిన రైతులు ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ, మొక్కజొన్న, పెసర, మినుము, జొన్న పంటలు సాగు చేసేందుకు సైతం వెనకాడుతున్నారు. కరెంట్​ సప్లైపై రైతులకు భరోసా కల్పిస్తే మరిన్ని ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

24 గంటలు కరెంట్​ సప్లై చేయాలె..

24 గంటల ఉచిత కరెంట్​ను ప్రభుత్వం సక్రమంగా సప్లై చేయాలి. ఎక్కడా 24 గంటల కరెంట్​ అందడం లేదు. మాయ మాటలతో ప్రభుత్వం మోసం చేస్తోంది. యాసంగి సాగు ఆలస్యమైన క్రమంలో కరెంట్​ సక్రమంగా ఇస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. లేకుంటే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.

- గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే , ఇల్లందు