సోయా విత్తనాల కోసం..రైతుల తిప్పలు

సోయా విత్తనాల కోసం..రైతుల తిప్పలు
  • సీడ్​కోసం మహారాష్ట్ర వెళ్తున్న అన్నదాతలు
  • సబ్సిడీ విత్తనాల పంపిణీ బంద్​చేసి చోద్యం చూస్తున్న సర్కార్​

నిజామాబాద్, వెలుగు: రాష్ట్రప్రభుత్వం సబ్సిడీపై సోయా విత్తనాల​పంపిణీ నిలిపేయడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. ఇక్కడ సీడ్​ దొరకక మహారాష్ట్ర వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఆరుతడి పంటగా రైతులు ఎక్కువగా సోయానే సాగు చేస్తారు. డిమాండ్​ ఉండడం, మూడు, నాలుగు నెలల్లో పంట చేతికి రావడంతో దీన్ని సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతారు. ఏడాదికి సుమారు 70 వేల ఎకరాల్లో పంట సాగవుతుందని వ్యవసాయ అధికారుల అంచనా. ఈ ఖరీఫ్​ సీజన్​లో సమయానికి పెద్దవానలు పడనందున సోయా సాగు విస్తీర్ణం మరింత పెరిగే ఛాన్స్​ఉంది. కానీ గవర్నమెంట్​నుంచి సీడ్​ సప్లయ్​లేక, మార్కెట్​లో సీడ్​ దొరకక  మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటున్నారు. రేపు విత్తనం మొలకెత్తకుంటే ఎవరిని అడగాలో అనే ప్రశ్న రైతులకు ఎదురవుతోంది.

పొరుగు రాష్ట్రానికి పరుగు..

రెండేళ్ల కింద తెలంగాణ సర్కార్​33 శాతం సబ్సిడీతో సోయా సీడ్​సరఫరా చేసేది. పరిశోధనల తర్వాత అమ్మే విత్తనాలు కావడంతో రైతులు నమ్మకంతో ఉండేవారు.  రైతుబంధును సాకుగా చూపి, అగ్రికల్చర్​సబ్సిడీలను గవర్నమెంట్​ఆపేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీడ్​అవసరాల కోసం పొరుగు రాష్ట్రానికి పరుగులు తీస్తున్నారు. మహారాష్ట్రలోని నర్సీ, నాయగావ్, కొండల్​వాడీ, ధర్మాబాద్​వెళ్లి, గ్యారెంటీ లేని సీడ్​కొంటున్నారు.​ఎకరాకు 30 కేజీల సీడ్​బస్తా సరిపోగా, అందుకోసం రూ.2,400 నుంచి రూ.3,500 వరకు ఖర్చుచేస్తున్నారు.  రెండేళ్ల కింద మనరాష్ట్రంలో ఇదే సీడ్​బస్తా సబ్సిడీపై రూ.1700 వరకు లభించేది. దీంతో సగటున 4, 5 ఎకరాల్లో సోయా వేసే రైతులు విత్తనాలకే అదనంగా రూ.4000 నుంచి రూ.6000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.

సబ్సిడీ లేని సీడ్ ఇచ్చినా మేలే..

ఉమ్మడి జిల్లాలోని బోధన్​, కోటగిరి, ఆర్మూర్, భీమ్​గల్, మోర్తాడ్, రెంజల్​తో పాటు మద్నూర్, జుక్కల్, గాంధారి ఏరియాల్లో సోయా సాగు అధికంగా ఉంటుంది. సాగునీటి  సౌలత్​తక్కువగా ఉన్న మెరక భూమిలో వర్షాధార పంటగా దీన్ని సాగు చేస్తారు. 20 రోజులకో తడి చొప్పున నీరందితే సరిపోతుంది. సబ్సిడీ లేకుండా ఇక్కడి గవర్నమెంట్​ సీడ్​అమ్మినా, కొనేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. సహకార సొసైటీలు మేలు రకం సీడ్​ను అందుబాటులో ఉంచితే, రైతులు భరోసాగా పంట సాగు చేసుకోవచ్చు.

రూ.80 వేల సీడ్ ​తెచ్చిన..

గవర్నమెంట్​సబ్సిడీపై సోయా సీడ్​ పంపిణీ ఆపేయడం సరికాదు. నేను 20 ఎకరాల్లో సోయా సాగు చేయడానికి మహారాష్ట్ర నుంచి రూ.80 వేలు ఖర్చుపెట్టి సీడ్​తెచ్చిన.  మనరాష్ట్రంలోనే విత్తనాలు సరఫరా చేస్తే, పక్క రాష్ట్రానికి పోయ్యే పరిస్థితి ఉండేదికాదు. భరోసాతో పంట వేసే వాళ్లం.   

అనిల్, ఖాజాపూర్, బోధన్​

గవర్నమెంట్​సీడ్​పై నమ్మకం ఉంటుంది

విధిలేని స్థితిలో పక్క రాష్ట్రం నుంచి సీడ్​ తెచ్చుకున్నం. అక్కడి వ్యాపారులు చెప్పింది విని సీడ్​ తీసుకోవడమే తప్ప మాకేం తెలవదు. ఇంత ఖర్చు చేసి విత్తనాలు వేస్తే, మొలుస్తయో, లేదోనని అనుమానంగా ఉంది. గవర్నమెంట్​ సీడ్​సప్లయ్​ చేస్తే నమ్మకంగా ఉండేవాళ్లం.
కేజీ గంగారాం, సాలూరా, బోధన్​