పత్తి అమ్మకాలకు  పడిగాపులు .. రోజుకు 150 వాహనాలకే టోకెన్లు 

పత్తి అమ్మకాలకు  పడిగాపులు .. రోజుకు 150 వాహనాలకే టోకెన్లు 
  • తరచూ బంద్​లతో రైతులకు ఇబ్బందులు 
  • జిల్లాలో 12 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా

మంచిర్యాల/చెన్నూర్​, వెలుగు: జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి 'అమ్మబోతే అడవి' అన్న చందంగా మారింది.  పత్తిని అమ్ముకోవడానికి  జిల్లాలో రైతులు నానాపాట్లు పడుతున్నారు. కూలీల కొరత వల్ల పత్తి ఏరుడు ఆలస్యమవుతుండగా, చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి సైతం అవస్థలు తప్పడం లేదంటున్నారు.  రైతులకు మద్దతు ధర చెల్లించడానికి ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసినా అక్కడా చుక్కెదురవుతోంది. జిన్నింగ్​ మిల్లుల్లో పత్తి నిల్వలు పేరుకుపోయాయని, వాతావరణ మార్పుల సాకుతో సీసీఐ అధికారులు తరచూ కొనుగోళ్లు నిలిపేస్తున్నారు.

మాయిశ్చర్​ పేరుతో కొర్రీలు పెడుతున్నారు. రోజుకు 150 బండ్లకే టోకెన్లు ఇవ్వడం వల్ల మిగతా రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇదే అదునుగా  ప్రైవేట్​ వ్యాపారులు రంగ ప్రవేశం చేసి రైతులను అందినకాడికి దోచుకుంటున్నారు.  పత్తిని అమ్ముకోవడానికి రైతులు జిల్లాలోని మార్కెట్​ యార్డుల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వాహనాల్లో లోడ్​ చేసి రెండు మూడు రోజులు వేచి చూడటం వల్ల  పత్తిలో తేమ శాతం పెరుగుతోందని అంటున్నారు.

సీసీఐ అధికారులు ముందుగా మార్కెట్​ యార్డుల్లో తేమ శాతం చెక్​ చేస్తున్నారు. మాయిశ్చర్​ 12 శాతం కంటే తక్కువ ఉండి, నాణ్యమైన పత్తిని జిన్నింగ్​ మిల్లులకు పంపుతున్నారు. తేమ శాతం ఎక్కువ ఉంటే ధర తగ్గించడం లేదా రిజెక్ట్​ చేస్తున్నారు. మార్కెట్​ అధికారులు రోజుకు 150 బండ్లకు మాత్రమే టోకెన్లు జారీ చేస్తున్నారు. 

టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్న రైతులు.. 

పత్తి అమ్మేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన రైతులు టోకెన్ల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. అటు జన్నింగ్​ మిల్లుల్లో తూకం సైతం ఆలస్యమవుతోంది. దీంతో రైతులపై వెయిటింగ్​ చార్జీల భారం పడుతోంది. ఒక్కో వెహికల్​కు రోజుకు రూ.2వేల నుంచి రూ.3వేలు నష్టపోతున్నారు. చెన్నూర్​ మార్కెట్​ యార్డుకు మంగళ, బుధ, గురువారాల్లో వందలాది వాహనాలు వచ్చాయి. ఎన్​హెచ్​ 63పై మార్కెట్​ యార్డు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. పలువురు రైతులు రెండు రోజుల నుంచి టోకెన్ల కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

 రైతుల దగ్గర కొని సీసీఐలో అమ్ముతున్నరు...  

సీసీఐ అధికారుల తీరు రైతులకు శాపం కాగా, వ్యాపారులకు మాత్రం వరంగా మారింది. ప్రైవేట్​ వ్యాపారులు మార్కెట్ యార్డులు, జిన్నింగ్​ మిల్లుల దగ్గర మకాం వేసి సీసీఐ రిజెక్ట్​ చేసిన పత్తిని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర రూ.7,020 ఉండగా, వ్యాపారులు రూ.6వేల నుంచి రూ.6,500 వరకు చెల్లిస్తున్నారు. టోకెన్లు దొరకనివారు, డబ్బులు అత్యవసరం ఉన్న రైతులు ప్రైవేట్​ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వ్యాపారులు అదే రైతుల పేరిట, లేదా కౌలు రైతుల పేరిట అదే పత్తిని సీసీఐకి మద్దతు ధరకు అమ్ముతున్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు వేయించుకొని విత్​ డ్రా చేసుకుంటున్నారు. అక్కడికక్కడే క్వింటాలుకు రూ.800 నుంచి రూ.వెయ్యి లాభం పొందుతున్నారు. ఇలా సీసీఐ, మార్కెటింగ్​ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్న... 

 నేను నాలుగు ఎకరాల్లో పత్తి వేసిన. 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సీసీఐకి అమ్ముదామని తీసుకొచ్చిన. రెండు రోజుల నుంచి ఇక్కడే రోడ్డుపై ఉంటున్న. ఇయ్యాల (గురువారం) టోకెన్​ ఇచ్చారు. రేపు (శుక్రవారం) ఉదయం బండి లోపకి పోతదేమో. బండిలో లోడ్​ చేసి ఉన్నందుకు తేమ శాతం పెరుగుతుంది. తేమ ఎక్కువైతే కొంటరో రిజెక్ట్​ చేస్తరో అని భయమైతుంది. సీసీఐ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నరు. 

పెండ్లి సంపత్​, కాంబోజిపేట, చెన్నూర్​ 

ఒక్కో రైతుకు 40 క్వింటాళ్లే....  

నేను పది ఎకరాల్లో పత్తి పంట సాగు చేసిన. వంద క్వింటాళ్లు పండింది. ఒక్కో రైతు పేరిట 40 క్వింటాళ్లు మాత్రమే కొంటామని అంటున్నరు. మిగతా 60 క్వింటాళ్లు ఎవల పేరు మీద అమ్మాలో అర్థమైతలేదు. నేను రెండు రోజుల నుంచి ఇక్కడ లైన్​లో ఉన్న. ట్రాక్టర్​కు రోజుకు రూ.1500 వెయిటింగ్​ చార్జీలు పడ్డయి. సీసీఐ ఆఫీసర్లు తేమ సక్కగ చూస్తలేరు. మాయిశ్చర్​ రాలేదని రేటు తగ్గిస్తున్నరు. ఇదేంటని అడిగితే రిజెక్ట్​ చేస్తున్నరు.  

 అయిత తిరుపతిరెడ్డి, పొక్కూర్​, చెన్నూర్​