రైతుల పెట్టుబడి కష్టాలు

రైతుల పెట్టుబడి కష్టాలు
  • ఏటా పెరుగుతున్న సాగు పెట్టుబడి
  • విత్తనాల నుంచి కోతల వరకు ఎకరానికి రూ.30 వేల ఖర్చు
  • కూలీల నుంచి ట్రాక్టర్ల కిరాయిల దాకా అన్నీ పెరిగినయ్‌‌
  • సబ్సిడీలు లేక, లోన్లు రాక, వడ్ల పైసలు చేతికందక ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్‌‌ షురూ అయింది. రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నరు. ఇప్పుడిప్పుడే పొలాల్లో పత్తి, పెసర, మక్క తదితర విత్తనాలు వేస్తున్నరు. ఈయేడు సాగులో విత్తనాల నుంచి కూలీల వరకు అన్ని రకాల ధరలు పెరిగాయి. దీంతో సాగుకు లాగోడి కష్టమైతాందని రైతులు అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా దున్నుడు ఖర్చులు, విత్తన ధరలు, ఎరువులు, కూలీల రేట్లు అన్నీ భారీగా పెరిగాయి. ఈ ధరలు రైతుల గుండెల్లో బుగులు పుట్టిస్తున్నయి. చేతుల రూ.10 వేలు పెట్టుకున్నా ఎకరం పంట కూడా వేయలేకపోతున్నమని వాపోతున్నరు. విత్తన సబ్సిడీ లేక, లోన్లు రాక, అమ్మిన వడ్ల పైసలు చేతికందక ఇబ్బంది పడుతున్నామని అంటున్నరు. 

కిరాయిలు తడిసి మోపెడు.. 

దుక్కి దున్నడం మొదలు పంట కోత వరకు మెకనైజేషన్‌‌పై రైతులు ఆధారపడక తప్పడం లేదు. ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిలు కూడా పెరిగి తడిసి మోపడవుతున్నయి. ఇంధన ధరలు ఇప్పుడు రైతులకు అదనపు భారంగా మారుతున్నయి. దీంతో రైతులు యంత్రాల వైపు మళ్లుతున్నరు. దుక్కి దున్నడం మొదలు పంట కోత వరకు మెకనైజేషన్‌‌‌‌పై ఆధారపడక తప్పడం లేదు. ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిలు కూడా పెరిగి తడిసి మోపడవుతున్నయి. ఇంధన ధరలు ఇప్పుడు రైతులకు అదనపు భారంగా మారుతున్నయి. దీంతో రైతులు పాత పద్ధతుల్లో సాగు చేయలేక, కొత్త పద్ధతుల్లో ధరలు భరించలేక ఇబ్బందులు పడుతున్నరు. చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 

దున్నడానికి ఎకరానికి రూ.3 వేలు

పంట సాగు కోసం భూమి దున్నడానికి గంటకు రూ.2 వేలు వసూలు చేస్తున్నరు. నిరుడు గంటకు రూ.1,500 ఉన్న కిరాయి.. ఇప్పుడు రూ.500 పెరిగింది. ఎకరం భూమి దున్నాలంటే గంటన్నర టైమ్‌‌‌‌ పడుతుంది. అంటే ఎకరానికి దున్నుడు ఖర్చు ఇదివరకు రూ.2 వేలు అయితే, ఈయేడు రూ.3 వేలు అవుతోంది. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌‌‌‌లో 1.45 కోట్ల ఎకరాల్లో పంట సాగు చేయాలని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అంటే రాష్ట్రంలో దున్నడానికి అయ్యే ఖర్చే రూ.4,350 కోట్లు అవుతోంది. 

ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి

రాష్ట్రంలో ఏ పంట వేసినా ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి అవుతోంది. గతంలో ఒక్కో కాటన్‌‌‌‌ సీడ్‌‌‌‌ ప్యాకెట్‌‌‌‌ రూ.730 నుంచి రూ.767 కాగా, ఇప్పుడు 450 గ్రాముల ప్యాకెట్‌‌‌‌కు రూ.810 అయింది. నిరుడు రోజు వారీ కూలీల ధర రూ.200 ఉంటే, నేడు రూ.300 వరకు పెరిగింది. మక్కల విత్తనాలు గతంలో 5 కిలోల సంచి రూ.1,000 రూ.1,500 వరకు ఉంటే, నేడది రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అమ్ముతున్నరు. అగ్రికల్చర్‌‌‌‌ యూనివర్సిటీ అమ్మే మక్క విత్తనాలు క్వింటాల్‌‌‌‌ రూ.40 వేల వరకు ఉండగా, బహిరంగ మార్కెట్‌‌‌‌లో వివిధ కంపెనీల పేరుతో కిలో విత్తనాలే వేలకు వేలు అమ్ముతున్నరు. విత్తనాలు, ఎరువులు నుంచి కోతల వరకు అన్నీ కలిపి ఏది చూసినా ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతోంది. నిరుడు కంటే ఖర్చు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగింది. 

సాగు అంటే కత్తీ మీద సాములా ఉంది..

మూడెకరాల్లో పత్తి సాగు చేస్తున్న. ట్రాక్టర్‌‌‌‌ దున్నడానికి, ఇతర పనులకు, ఎరువులు, విత్తనాలకు రూ.90 వేలకు పైగా ఖర్చు అవుతున్నది. కేవలం ఎకరంలో వేసే విత్తనాలకే రూ.10 వేల వరకు ఖర్చు అవుతుంది. మరోవైపు కూలి రేట్లు కూడా పెరిగాయి. పండించిన పంటకు పెట్టిన పెట్టుబడి పోగా పెద్దగా మిగులతలేదు. వ్యవసాయం చేయడం కత్తిమీద సాము అవుతోంది. 
‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌- రాంమూర్తి, రైతు, మహబూబాబాద్‌‌‌‌ జిల్లా