వడ్ల పైసల కోసం.. రైతుల తిప్పలు

వడ్ల పైసల కోసం.. రైతుల తిప్పలు
  • రోజుల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు 
  • గంటల తరబడి లైన్​లో నిల్చోలేక క్యూలైన్లలో చెప్పులు  
  • ఒక్కొక్కరికి రూ.10 వేలు మాత్రమే ఇస్తున్న బ్యాంకులు 
  • ఎన్ని రోజులు బ్యాంకుల చుట్టూ తిరగాలని రైతుల ఆవేదన

మెదక్/వెల్దుర్తి, వెలుగు: వడ్ల పైసలు, రైతుబంధు డబ్బులు డ్రా చేసుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. డబ్బులు తీసుకునేందుకు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకుల వద్ద భారీగా రద్దీ ఉండడంతో గంటల తరబడి లైన్​లో నిల్చోలేక క్యూలైన్లలో చెప్పులు పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. వడ్లు అమ్మిన 48 గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడతాయని ప్రభుత్వం చెప్పింది. కానీ, నెల రోజుల తర్వాత గానీ డబ్బులు జమ కాలేదు. డబ్బులు ఆలస్యంగా రావడంతో పాటు వానాకాలం సీజన్ మొదలు కావడంతో పెట్టుబడి కోసం రైతులు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. కానీ బ్యాంకర్లు ఒక్కొక్కరికి రూ.10 వేలు మాత్రమే ఇస్తుండడంతో రైతులు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. దీంతో అకౌంట్​లో పైసలున్నా చేతికి అందక వానాకాలం సాగు పనులకు ఇబ్బందవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వడ్ల డబ్బులు ఒకేసారి ఇవ్వకుండా రూ.10 వేల పరిమితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇట్ల రూ.10 వేల చొప్పున ఇస్తే పెట్టుబడికి ఎట్ల సరిపోతాయని మండిపడుతున్నారు.

రైతుబంధు డబ్బుల కోసం కూడా..

వడ్ల బకాయిల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వం ఇటీవల రిలీజ్​ చేసింది. రైతుబంధు డబ్బులు కూడా మూడ్రోజులుగా విడతల వారీగా రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నది. దీంతో ఆ డబ్బులు తీసుకునేందుకు రైతులు బ్యాంక్​ల వద్ద బారులు తీరుతున్నారు. జిల్లాల్లోని అన్ని  బ్యాంకులు రైతులతో కిటకిటలాడుతున్నాయి. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని సెంట్రల్​ బ్యాంక్ వద్దకు బుధవారం పొద్దున్నే పెద్ద సంఖ్యలో రైతులు వచ్చారు. వారితో పాటు పెన్షన్​ డబ్బులు డ్రా చేసుకునేందుకు వృద్ధులు కూడా రావడంతో రద్దీ పెరిగింది. వారంతా  ఒకేసారి బ్యాంక్​ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. పోలీసులు వచ్చి వారిని క్యూలో నిలబెట్టారు. దీంతో డబ్బులు తీసుకోవడానికి  గంటల తరబడి నిలబడాల్సి రావడంతో ఓపిక లేక కొందరు వృద్ధులు, మహిళలు తమ చెప్పులను క్యూలైన్​లో పెట్టి పక్కన కూర్చున్నారు.