ఎండకు తల్లడిల్లుతున్న రైతులు..వడ్ల కొనుగోలు సెంటర్లలో వసతుల కరువు

ఎండకు తల్లడిల్లుతున్న రైతులు..వడ్ల కొనుగోలు సెంటర్లలో వసతుల కరువు
  •      వడ్ల కొనుగోలు సెంటర్లలో వసతుల కరువు
  •      నీడ, నీళ్లు లేక డీ హైడ్రేషన్​కు గురవుతున్న అన్నదాతలు
  •      వసతులు కల్పించడంలో నిర్వాహకులు ఫెయిల్‌‌

పెద్దపల్లి/కరీంనగర్, వెలుగు:  వడ్ల కొనుగోలు సెంటర్లలో రైతులు ఎండకు తల్లడిల్లుతున్నారు. సెంటర్ నిర్వాహకులు కేంద్రాల్లో సరైన వసతులు కల్పించకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండడంతో రైతులు కొనుగోలు సెంటర్లలో నిలువలేకపోతున్నారు. వ్యవసాయ మార్కెట్ల​ అధికారులు మాత్రం వడ్ల కొనుగోలు సెంటర్లలో రైతులు ధాన్యం అమ్ముకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్తున్నారు. చాలా సెంటర్లలో నిలవడానికి నీడ, తాగడానికి నీళ్లు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఎండ తీవ్రతతో రైతులు డీహైడ్రేషన్​కు గురవుతున్నారు. రైతుల కోసం ఓఆర్ఎస్ పాకెట్లు అందించాల్సి ఉంది. కానీ అలాంటి ఏర్పాట్లు ఎక్కడా కన్పించడం లేదు. మరోవైపు కొనుగోలు సెంటర్లలో రైతుల కోసం మౌలిక సదుపాయాలతో పాటు అకాల వర్షాల నుంచి వడ్లను కాపాడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని  ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా... ఎక్కడా  అమలు జరిగినట్లు 
కన్పించడం లేదు. 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,335 కేంద్రాలు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,335 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 436  కొనుగోలు సెంటర్లకు గానూ 351 సెంటర్లు ఓపెన్​ అయ్యాయి. వీటిలో 160 కొనుగోలు సెంటర్లలో కొనుగోళ్లు మొదలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 345 కొనుగోలు సెంటర్లకు గానూ 308 సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2.10 లక్షల ఎకరాల్లో సాగవగా.. 4.50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 236 కొనుగోలు సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా వేశారు. కరీంనగర్​ జిల్లాలో 318 కొనుగోలు కేంద్రాలకుగానూ 205 సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఈ జిల్లాలో 6.50 లక్షల మెట్రిక్​ టన్నులుగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మండుతున్న ఎండలు.. 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. సుమారు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతను ముందుగా అంచనా వేయని వ్యవసాయాధికారులు ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద కావాల్సిన ఏర్పాట్లు చేయలేకపోయారు. సెంటర్ల వద్ద సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. కోతలు స్పీడందుకోవడంతో కొనుగోలు సెంటర్లు ధాన్యంతో నిండిపోతున్నాయి. ఇప్పటివరకు కొనుగోళ్లు స్పీడు పెంచకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరుతున్నారు. మరోవైపు డీసీఎంఎస్​, జిల్లా సహకార శాఖ, గ్రామీణాభివృద్ది, మార్కెటింగ్​ శాఖల ద్వారా ధాన్యం కొనుగోలు కోసం సెంటర్లను ఏర్పాటు చేశారు. కానీ చాలా కొనుగోలు సెంటర్లలో రైతులకు కావాల్సిన ఏర్పాట్లు ఆయా శాఖల అధికారులు చేయలేకపోయారు. యాసంగి కొనుగోళ్ల సందర్బంగా ప్రతీ కేంద్రంలో చలువ పందిళ్లు, మంచినీటి వసతి, కరెంటు, టాయిలెట్లు ఏర్పాటు చేయలేదు. ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో ఏర్పాట్లు చేయలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని సెంటర్లలో నామమాత్రంగా తడికలు వేసి షెడ్లు వేశారు, కానీ ఇటీవల వస్తున్న గాలులకు అవి కూడా కొట్టుకుపోయినట్లు రైతులు చెప్తున్నారు.