
- ఎన్నికలు మళ్లా రావట్టె.. లోన్ మాఫీ కాకపాయె
- 30 లక్షల మంది రైతుల ఎదురుచూపులు
- రూ. లక్ష మాఫీ చేస్తామని చెప్పి.. చేసింది రూ. 37వేల లోపే
- నాలుగున్నరేండ్లలో రూ.1,207 కోట్లు మాత్రమే చెల్లించిన ప్రభుత్వం
- ఇంకా రూ. 20 వేల కోట్లు కావాలె
- మనతోపాటు ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే మాఫీ పూర్తి
హైదరాబాద్, వెలుగు: రుణమాఫీ కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీని మళ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్నా రాష్ట్ర సర్కారు నెరవేరుస్తలేదు. లక్ష రూపాయల లోన్లు మాఫీ చేస్తామని చెప్పి.. రూ. 37 వేల లోపు ఉన్న రుణాలు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకున్నది. ఏటా రుణమాఫీ కోసం బడ్జెట్ లో కేటాయింపులు చేస్తున్నప్పటికీ.. నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. ఈసారి కూడా రూ.6,385 కోట్లు కేటాయించారు. ఆ మొత్తం ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసినా.. ఇంకా 50 శాతం మంది అర్హులైన రైతులు మిగిలిపోతారు. మొత్తంగా దాదాపు 30 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకోదిక్కు కొత్త లోన్లు పుట్టక.. వడ్డీలతో తడిసిమోపెడైన పాత లోన్లు తీర్చ లేక అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. తెలంగాణకు ఎన్నికల జరిగిన 2018కి ఒక ఏడాది అటు.. ఇటుగా ఎలక్షన్స్ జరిగిన ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన హామీ ప్రకారం క్రాప్ లోన్లను అక్కడి పాలకులు దాదాపు మాఫీ చేశారు.
ఇతర రాష్ట్రాల్లో ఇట్లా..!
తెలంగాణతో పాటు ఎన్నికల సందర్భంగా పలు రాష్ట్రాలు వారి వారి ప్రాంతాల్లోని రైతులకు రుణమాఫీ హామీని ఇచ్చారు. 2018లోనే ఎన్నికలు జరిగిన రాజస్థాన్‌లో రూ.26,500 కోట్ల పంట రుణాల మాఫీ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రూ. 22 వేల కోట్ల మేర ఇప్పటికే మాఫీ చేసింది. దీంతో అక్కడ 23 లక్షల మంది దాకా రైతులకు ప్రయోజనం చేకూరింది. పంజాబ్‌లో రూ.10 వేల కోట్ల రుణమాఫీ ప్రకటించగా.. దాదాపుగా పూర్తి చేశారు. కర్నాటకలో రుణమాఫీ ప్రకటించకపోయినప్పటికీ.. దాదాపు రూ.22 వేల కోట్ల క్రాప్లోన్లు మాఫీ చేశారు. దీంతో అక్కడ 46 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరింది. మహారాష్ట్రలోనూ 2017లో ప్రకటించిన హామీ మేరకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేశారు. యూపీలో దాదాపు రూ.29 వేల కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి. చత్తీస్ గఢ్‌లో హామీ ఇవ్వకపోయినా.. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి పాలకులు రూ. 6,100 కోట్లు మాఫీ చేశారు. మధ్యప్రదేశ్‌లోనూ రూ.15 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసినట్లు సమాచారం.
నాలుగున్నరేండ్లలో జరిగిన మాఫీ
రూ.1,200 కోట్లే
రాష్ట్ర సర్కార్ రుణమాఫీ ఎప్పుడు చేస్తుందోనని మన రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నాలుగు సార్లు అసెంబ్లీలో ప్రకటించినా నిధులు రిలీజ్ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు రూ.37 వేలలోపు పంట రుణాలు మాత్రమే మాఫీ చేసింది. ఇందుకు రూ.1,207 కోట్లు వెచ్చించింది. దీంట్లో రూ.25 వేల లోపు రుణాలు ఉన్నవాళ్లకు మాత్రమే మాఫీ పూర్తిస్థాయిలో అమలైంది. రూ.37వేల లోపు రుణాలున్న వాళ్లలోనూ కొందరు మిగిలిపోయారు. రూ.50 వేల నుంచి లక్ష లోపు ఉన్న పంట రుణాలే ఎక్కువగా ఉన్నాయి. వీటిని మాఫీ చేయాలంటే దాదాపు రూ.20 వేల కోట్లు అవసరం. గడిచిన నాలుగేండ్లలో ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్లో పెట్టిన రుణమాఫీ నిధుల మొత్తం రూ.26,549.20 కోట్లకు చేరింది. ఏటా కేటాయించిన నిధులన్నీ రిలీజ్‌చేస్తే ఇప్పటికే రుణమాఫీ పూర్తయ్యేది. కానీ.. వాటిని రిలీజ్ చేయలేదు. ఇటీవల ఫిబ్రవరిలో కేటాయించిన రూ.6,385 కోట్లు ఇచ్చినా..పంట రుణాలు మాఫీ అయ్యే పరిస్థితి లేదు.
వడ్డీలు.. చెడగొట్టు వానలు.. గిట్టుబాటు ధర నష్టాలు
బ్యాంకులో తీసుకున్న అప్పులకు వడ్డీకి వడ్డీ జమ చేస్తూ తమపై రుణ భారాన్ని పెంచుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది బ్యాంకర్లు మాత్రం వడ్డీని వసూలు చేస్తూ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన తర్వాత అసలు డబ్బులను మాఫీ చేస్తామం టున్నారు. నాలుగేండ్లుగా రాష్ట్రంలో వర్షాలు, వరదలు, చెడగొట్టు వానలు, వడగండ్లతో ప్రతి సీజన్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరుగుతున్నది. దీనికి ప్రభుత్వం నుంచి పైసా పరిహారం కూడా అందడం లేదు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సీఎం సాయం ప్రకటించినప్పటికీ అదీ ఇంకా రైతులకు చేరలేదు. మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయడం లేదు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.