
- మూడు నుంచి రెండుకు తగ్గిన పంపుహౌజ్‌లు
- బసవేశ్వర పంపుహౌజ్ ఎత్తు 19.6 మీటర్లు తగ్గించే యోచన
- కరెంట్ ఖర్చులు తగ్గించుకునేందుకే అంటున్న ఆఫీసర్లు
- కాస్ట్ కటింగ్‌లో భాగమేనన్న వాదనలు
సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో సాగునీటి అవసరాల కోసం నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర భారీ ఎత్తిపోతల స్కీంలు చిన్నబోతున్నాయి. ఇప్పటికే భూ సేకరణ సమస్యగా మారగా.. తాజాగా లిఫ్టుల డిజైన్ల మార్పు, పంప్ హౌజ్‌ల తగ్గింపుతో రైతుల్లో ఆందోళన నెలకొంది. దీంతో 3.84 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నా పూర్తవుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నీటిని ఎత్తి పోసేందుకు పరిమితి స్థాయిలో విద్యుత్ ను వాడి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు డిజైన్లలో మార్పులు చేస్తున్నామని నీటిపారుదల శాఖ ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ, బడ్జెట్తగ్గించుకునేందుకే ఇలా చేస్తున్నారని, అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆరు నెలల కిందే శంకుస్థాపన
జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మొత్తం 3.84 లక్షల వ్యవసాయ భూములకు నీరందించేందుకు సంగమేశ్వర, బసవేశ్వర భారీ ఎత్తిపోతల స్కీంలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు 4,427 కోట్లు ఖర్చు అవుతుందనేని అంచనా. నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలం బోరంచ వద్ద బసవేశ్వర..ఆందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలం ఐదులాపూర్ వద్ద సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించనున్నారు. దీనికోసం సీఎం కేసీఆర్ గత ఫిబ్రవరి 21న నారాయణఖేడ్ లో పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం ప్రారంభించి ఆరు నెలలైనా ఇప్పటికీ ఒక్క ఎకరా కూడా సేకరించలేకపోయారు.
అంతలోనే డిజైన్లలో మార్పులు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా 17,18,19 ప్యాకేజీల కింద పనులు చేపట్టేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తయితే సింగూరులో అదనపు జలాలు అందుబాటులోకి వస్తాయి. అక్కడి నుంచి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా 24 టీఎంసీల నీటిని ఆయకట్టుకు తరలించేందుకు లిఫ్టులను డిజైన్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా భూ సేకరణ విషయంలో రైతులకు నోటీసులు ఇవ్వకుండా, పరిహారం విషయంలో క్లారిటీ ఇవ్వకుండా అధికారులు హద్దు రాళ్లు పాతారు. దీంతో బాధిత రైతులు ప్రత్యక్ష పోరాటానికి దిగి భూసేకరణను అడ్డుకున్నారు. దీంతో ఏమైందో ఏమో గాని ఆరు నెలల తర్వాత ఇరిగేషన్ శాఖ రీ డిజైనింగ్‌పై దృష్టి పెట్టింది. రాయికోడ్ మండలం ఐదులాపూర్ వద్ద నిర్మించనున్న సంగమేశ్వర లిఫ్ట్ పనుల్లో ముందుగా మూడుచోట్ల పంప్ హౌజ్‌లను నిర్మించాలని అనుకున్నారు. కానీ, ఎందుకో డిజైన్ మార్చి రెండు పంప్ హౌజ్‌లకు కుదించారు. లైనింగ్ డిజైన్ లో కూడా కొంత మార్పులు చేసి ప్రభుత్వానికి రెండు నెలల కింద నివేదికలు పంపించారు.
పంప్‌హౌజ్‌ల ఎత్తు తగ్గింపు
మనూర్ మండలం బోరంచ వద్ద నిర్మించాలనుకున్న బసవేశ్వర ఎత్తిపోతల స్కీంలో రెండు పంప్ హౌజ్‌లను నిర్మించాలనేది ప్లాన్. ఇందులో ఒక పంప్ హౌజ్ఎత్తు 70 మీటర్ల నుంచి 50.4 మీటర్లకు తగ్గించాలని నిర్ణయించారు. ఫస్ట్ పంపింగ్ వద్ద 2 మీటర్లు, సెకండ్ పంపింగ్ వద్ద 17.6 మీటర్లు కలిపి మొత్తం 19.6 మీటర్ల ఎత్తు తగ్గేటట్టు ఇరిగేషన్ అధికారులు ప్రపోజల్స్ తయారు చేశారు. దీనికి సంబంధించిన రీ డిజైన్ మ్యాప్ ను ప్రభుత్వానికి అందించగా, త్వరలో అందుకు తగ్గట్టుగా సర్క్యులర్ జారీ చేయబోతున్నట్టు సమాచారం. ఈ కొత్త డిజైన్ వల్ల ముందుగా అనుకున్న ఆయకట్టులో దాదాపు 4 వేల ఎకరాలు తగ్గే అవకాశాలు కనిపిస్తుండగా, అధికారులు మాత్రం మరో 2 వేల ఎకరాలు పెరగవచ్చని చెబుతున్నారు. పంప్‌హౌజ్‌ల సంఖ్య తగ్గిస్తూ, ఎత్తు కూడా తగ్గినా ఆయకట్టు ఎలా పెరుగుతుందో చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.